English   

మల్లేశం సినిమా రివ్యూ

Mallesham
2019-06-21 11:03:27

ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక బాష కాదు దాదపు అన్ని బాషలలో ఇదే ట్రెండ్. బహుశా ఆ వ్యక్తి చెడ్డవాడయినా బహుశా అతని వ్యూ పాయింట్ లో సినిమా ఉంటుంది కాబట్టి అతను మంచివాడనే భావన కలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మంచి చెడ్డా పక్కన పెడితే జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నం చేసి, చదువుతో కాదు బుర్ర ఉంటె ఏదయినా సాధ్యం అని నిరూపించిన ఒక తెలంగాణా బిడ్డ జీవితాన్ని సినిమాగా ఆవిష్కరించారు. నిజానికి ఈ సినిమాకి సురేష్ ప్రొడక్షన్ లాంటి సంస్థ అండ లేకుంటే ఒక డాక్యుమెంటరీలాగా వచ్చి పోయేదేమో కానీ సురేష్ ప్రొడక్షన్స్ ఎప్పుడు అయితే ఎంటర్ అయ్యిందో ఈ సినిమామీద ఆనాటి నుండి అంచనాలు పెరగడం మొదలయ్యాయి. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్ద్దాం.

కధ :

అచ్చమైన తెలంగాణా చేనేత కుటుంబంలో పుట్టిన మల్లేశం(దర్శి) చదువు మధ్యలోనే ఆపేసి అమ్మానాన్నలకు సాయం చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. నాన్నలా ఇతను మగ్గం నేయాలి, తండ్రీ కొడుకులు ఇద్దరికీ అమ్మ(ఝాన్సీ) ఆసు పోసి అందించాల్సి ఉంటుంది. ఆ కుర్రవాడు పుట్టకమునుపు నుండే ఆ పని చేసీ చేసీ ఆమె చేతులు పడిపోతాయి. ఆమె బాధ చూసి దీనికొక మెషీన్ ఎందుకు చెయ్యకూడదు? అనుకుంటాడు ఆ స్కూల్ మానేసే వయసులోనే, పెద్దవాడవుతాడు. ఇంకా పెద్ద వాడవుతాడు,  ఆసు మెషీన్ తయారుచెయ్యాలన్న కల అతడ్ని వెంటాడుతూనే ఉంటుంది, ఆ మెషీన్ మీద ప్రేమతో( జనానికి పిచ్చి అనే భావన) అప్పులు చేస్తుండడంతో పెళ్లి చేస్తే కుడురుకుంటాడని పెళ్లి చేస్తారు, అయినా మనోడికి ఆ మెషీన్ పిచ్చి పోదు. ఇక చదివింది ఆరో తరగతి. ఆ ఆరో తరగతి చదువుతోనే ఇంజినీరింగ్ చదువుతున్నవాళ్లకు కూడా తెలియని విషయాలు చదివి తెలుసుకుంటాడు. ఆసు మెషీన్ తయారుచేస్తాడు, ఇంతే కథ. 

విశ్లేషణ :

బయోపిక్ లు ప్రేక్షకుల మనసుకు హత్తుకోవాలంటే కేవలం విజయాన్ని ఒక్కటి చూపిది చాలదు, ఆ విజయం అందుకోవడానికి అతను పడిన కష్టాన్ని, అసలు ఆ కోరిక ఎందుకు కలిగిందో అనే ఇతివృత్తాన్ని చూపాలి, దర్శకుడు రాజ్ ఆర్ ఈ విషయాల్లో సఫలీకృతుడయ్యారు. 90వ దశకంలో జరిగే కథ ఇది. మల్లేశం స్వగ్రామం రేవన్ పల్లెలో చిత్రీకరణ జరపడంతో నాటి పరిస్థితుల్ని యథాతథంగా కళ్లకు కట్టిన భావన కలుగుతుంది. తెలంగాణ మారుమూల పల్లె వీధుల్లో విహరిస్తూ అక్కడి మట్టిమనుషులతో సంభాషిస్తున్న అనుభూతికి లోనవుతాం. మల్లేశం బాల్యం మొదలుకొని, అతని ప్రేమాయణం, ఆసు యంత్రం తయారీలో ఎదుర్కొన్న కష్టనష్టాల్ని ఎమోషనల్ గా ఆవిష్కరించారు. మల్లేశం బాల్యాన్ని, మిత్రబృందంతో చేసే అల్లరిని మనం ఫీల్ అవుతాం, ఆ ఊరిలో మనం కూడా ఒక భాగం అయినట్టు అనిపిస్తుంది. మల్లేశం ఆసు మెషీన్ తయారుచెయ్యడం కేవలం వాళ్ల అమ్మ కోసం చేసే పనిగానో, వాళ్ల అమ్మలా కష్టాలు పడుతున్నవాళ్లకోసం చేస్తున్న పనిగానో కనిపించదు. మెషీన్ తయారవ్వడం ఒక్కటే కథ అనుకుంటే, ఈ మనుషులే కలిసి ఆ కథను నడిపించాలి. అమ్మ కష్టాలు పోవాలి. మల్లేశం కమిట్‌మెంట్ చచ్చిపోవద్దు. భార్య అండగా నిలబడాలి. చుట్టూ ఉండే మనుషులు తోడు రావాలి. ఒక అతి సాధారణ మనిషి, తను నమ్మి చేసిన ఒక పని ఎన్ని జీవితాలను మారుస్తుందో చెప్పే చింతకింది మల్లేశం జీవిత కథ ఇది. కమర్షియల్‌ చిత్రాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. 

నటీనటులు :

మల్లేశం పాత్రలో ప్రియదర్శి, పద్మ పాత్రలో అనన్య,లక్ష్మీ పాత్రలో ఝాన్సీ అందరూ పోటాపోటీగా నటించారు. ఝాన్సీ తన అనుభవంతో మెప్పిస్తే. ప్రియదర్శి, అనన్య మాత్రం ప్రేక్షకులను నటనతో కట్టిపడేశారు. ఇంతవరకు నవ్వించడమే మాత్రమే ప్రియదర్శికి తెలుసు అనుకున్న ప్రేక్షకుడి చేత కంటతడిపెట్టిస్తాడు. మేల్లేశం స్నేహితులుగా నటించిన అన్వేష్, జగదీశ్ లు తెలుగు తెరకి దొరికిన మరో ఇద్దరు మంచి నటులని చెప్పచ్చు.  ఇక మిగతా నటీనటులు తమ పాత్ర పరిది మేరకు మెప్పించారు.

చివరిగా :  కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు...మహా పురుషులవుతారు.  

రేటింగ్ : 2.5 /5.

More Related Stories