English   

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రివ్యూ

Agent Sai Srinivasa Athreya Review
2019-06-21 14:28:50

వన్ నేనొక్కడినే, ‘డీ ఫర్‌ దోపిడీ’, ‘లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్‌’ సినిమాల్లో నటించిన న‌వీన్ పోలిశెట్టి తాజాగా హీరోగా రూపొందిన మూవీ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వ‌రూప్ ఆర్ఎస్‌జే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక ఈ సినిమా మీద అంచనాలు  పెరిగాయి. న‌వీన్ పొలిశెట్టి సరసన శృతి శ‌ర్మ నటిస్తున్న ఈ సినిమాని మళ్ళీ రావా లాంటి లవ్ ఎంటర్టైనర్ ని నిర్మించిన రాహుల్ యాద‌వ్ న‌క్క నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా అంచనాలకు ఏమేరకు అందుకుంది అనేది చూద్దాం.  

కథ

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఓ డిటెక్టివ్. ఎప్పటికైనా తన ఏజెన్సీని పెద్దగా మార్చాలని కలలు కంటుంటాడు. అలాంటి సమయంలో అనుకోకుండా ఓ అమ్మాయి మర్డర్ కేస్ తగులుతుంది. తీరా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్లే సరికి పూర్తిగా ఆ మర్డర్ కేసులో ఆత్రేయ ఇరుక్కుంటాడు. దాని వెనక పెద్ద మాఫియా జరుగుతుందని గుర్తిస్తాడు. ఒక్క మర్డర్ అనుకుంటే మూడు మర్డర్లు జరుగుతాయి. దానికి తోడు రైల్వే ట్రాక్స్ దగ్గర పడి ఉన్న అనాథ శవాలపై కూడా రీసర్చ్ చేస్తుంటాడు ఆత్రేయ. అసలు ఆ శవాలు అలా ఎందుకు వస్తున్నాయి.. ఎవరు పడేస్తున్నారు.. ఏం జరుగుతుంది అనేది అసలు కథ..

కథనం

చిన్న సినిమాల్లోనే చాలా పెద్ద విషయం ఉంటుంది. ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా చూసిన తర్వాత ఇది నిజమే అని మరోసారి అర్థమవుతుంది. నిజానికి ఈ సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకూ పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ రిలీజయ్యాక సినిమా మీద ఆసక్తి పెరిగింది. రెండు నిమిషాల ట్రైలర్ ఎంత ఆసక్తిగా అనిపించిందో రెండు గంటల సినిమా కూడా అంతే ఆసక్తిగా నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యారు. డిటెక్టివ్ డ్రామా ఇప్పటికే తెలుగులో ఎన్నో వచ్చినా కూడా వాటన్నింటికి మించి ఒక భిన్నమైన కథను ఎంచుకున్నాడు దర్శకుడు స్వరూప్. అమాయకుల నమ్మకాలతో ఆడుకునే రిలీజియస్ క్రైమ్ అనే కొత్త సబ్జెక్టును తీసుకొని కథను ఆసక్తికరంగా నడిపించాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉంది. హీరో నవీన్ పోలిశెట్టి కూడా స్క్రీన్ ప్లే సమకూర్చాడు. ఇక యూట్యూబ్ లో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నవీన్. నటుడిగా కూడా తనదైన ముద్ర వేశాడు. స్క్రీన్ పై చాలా కాన్ఫిడెంట్ గా డిటెక్టివ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా నడిచినా కూడా ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలు పెట్టాడు దర్శకుడు. అక్కడి నుంచి అసలైన డ్రామా మొదలైంది. ఊహించుకోవడానికి కూడా భయం కలిగించే కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చాలా క్లారిటీగా తెరకెక్కించాడు దర్శకుడు స్వరూప్. ఇలాంటి కథలను టచ్ చేసినప్పుడు కచ్చితంగా కాంట్రవర్సీలు వస్తాయి. అలాంటివి లేకుండా రాకుండా జాగ్రత్త పడ్డాడు ఈ దర్శకుడు. ఇప్పటివరకు ఎన్ని క్రైమ్ డిటెక్టివ్ డ్రామాలు వచ్చినా కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అక్కడక్కడా కాస్త సాగదీసినట్లు అనిపించినా ఒక మంచి ప్రయత్నంగా మాత్రం ఈ సినిమా మిగిలిపోతుంది.

ఫైనల్ గా : ఆకట్టుకునే సాయి శ్రీనివాస ఆత్రేయ.

రేటింగ్ : 2.75 /5.

More Related Stories