విజయ్ ఫస్ట్ లుక్ అదిరింది.. బిగిల్ అంటూ వచ్చేస్తున్న తళపతి..

అభిమానులకు ఒకరోజు ముందే బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు విజయ్. జూన్ 22న ఈయన పుట్టినరోజు. దాంతో విజయ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు దర్శక నిర్మాతలు. అట్లీ కుమార్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమాకు బిగిల్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. అసలు ఇప్పుడు విజయ్ కు ఉన్న ఇమేజ్ కు ఆయన సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది అని కాదు.. ఎవర్ని టార్గెట్ చేస్తున్నాడు అని అడగాలేమో..? అంతగా రెచ్చిపోతున్నాడు తళపతి. ఎందుకంటే ఈయన రొటీన్ స్టోరీలు చేయడం మానేసి చాలా కాలమైపోయింది. ఇప్పుడు అంతా రాజకీయంగా.. సోషల్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టాడు విజయ్. ఏ కథ అయినా ఒప్పుకుంటే అందులో ప్రేక్షకులకు ఏం చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నాడు. మెర్సల్.. తెరీ.. తుపాకి.. కత్తి.. మొన్నొచ్చిన సర్కార్ ఇలా ప్రతీ సినిమాలో కూడా విజయ్ ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నాడు. ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమాలో కూడా మరోసారి అదే చేస్తున్నాడు. తెరీలో పోలీస్ డ్రామా చూపించిన అట్లీకుమార్.. మెర్సల్ లో మెడికల్ మాఫియాపై ఫోకస్ చేసాడు.
ఇక ఇప్పుడు మూడోసారి ఏకంగా ఒలంపిక్స్ పై పడుతున్నారు. అవును.. క్రీడా నేపథ్యంలో జరిగే రాజకీయాల గురించి ఇందులో చూపిస్తున్నాడు అట్లీకుమార్. పుట్ బాల్ కోచ్ పాత్రలో ఇందులో నటిస్తున్నాడు విజయ్. 130 కోట్లు ఉన్న భారతదేశంలో ఎందుకు ఒలంపిక్ పథకాలు రావడం లేదనే విషయాన్ని ఇందులో చూపించబోతున్నాడు దర్శకుడు. అసలు ఎందుకు ఒలంపిక్ పథకాలు రావట్లేదు.. దాని వెనక ఎలాంటి రాజకీయాలు ఉన్నాయనే విషయంపై అట్లీ అద్భుతమైన కథ సిద్ధం చేసాడని తెలుస్తుంది. ఇప్పటికే బిగిల్ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది. దసరాకు సినిమా విడుదల కానుంది. తండ్రీ కొడుకులుగా ఇందులో నటిస్తున్నాడు విజయ్. తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదిరింది, సర్కార్ లాంటి సినిమాలతో ఇక్కడ కూడా విజయ్ మార్కెట్ పెరిగింది. మొత్తానికి ప్రతీ సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతున్నాడు విజయ్. ఇప్పుడు ఒలంపిక్స్ ను టార్గెట్ చేస్తే క్రీడా రంగానికి పెద్ద షాకే. మరి బిగిల్ సినిమా ఎన్ని సంచలనాలకు తెరతీస్తుందో చూడాలిక.