English   

నితిన్, చంద్రశేఖర్ యేలేటి సినిమా ప్రారంభం..

 Nithin
2019-06-23 11:51:10

శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు నితిన్. దాదాపు ఎనిమిది నెలలకు పైగా రెస్ట్ తీసుకొని ఈ మధ్యే భీష్మ సినిమా మొదలు పెట్టాడు ఈ కుర్రహీరో. వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. ఛలో తర్వాత ఈయన చేస్తున్న సినిమా భీష్మ. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగానే ఇప్పుడు మరో సినిమాకు ముహూర్తం పెట్టాడు నితిన్. ఇది ఈయనకు 28 వ సినిమా. విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రశేఖర్ ఏలేటితో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. నాలుగేళ్ల కింద మోహన్ లాల్ హీరోగా మనమంతా సినిమాను తెరకెక్కించాడు చంద్రశేఖర్ ఏలేటి. ఈ చిత్రానికి కూడా ఎప్పటిలాగే ప్రశంసలు దక్కాయి.. కానీ కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. మూడేళ్లకు పైగా స్క్రిప్టు రాసుకుని గోపీచంద్, సాయి ధరమ్, నాగచైతన్య లాంటి హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నించినా కూడా చంద్రశేఖర్ ఏలేటికి నిరాశ ఎదురైంది. చివరికి నితిన్ కు చెప్పి ఒప్పించి ఈ సినిమాను కొబ్బరికాయ వరకు తీసుకు వచ్చాడు చంద్ర శేఖర్ యేలేటి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, సెన్సేషనల్ ప్రియా వారియర్ నటించబోతున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ఏడాది షూటింగ్ పూర్తిచేసి 2020 సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. వరుస పరాజయాలతో ఉన్న నితిన్ కెరీర్ కు చంద్రశేఖర్ ఏలేటి సినిమా కీలకంగా మారింది. మరోవైపు ఈయనకు కూడా ప్రశంసలు మాత్రమే వస్తున్నాయి.. దాంతో కమర్షియల్ గా హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు చంద్రశేఖర్ ఏలేటి. మరి ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

More Related Stories