English   

తన బాధ్యతను చిరంజీవికి అప్పగించిన రామ్ చరణ్..

chiru
2019-06-23 18:53:39

ఎక్కడైనా తండ్రి బాధ్యతలు కొడుకు తీసుకుంటాడు కానీ ఇక్కడ మాత్రం కాస్త విచిత్రంగా జరుగుతుంది. మెగా ఫ్యామిలీలో తన బాధ్యతలు తీసుకెళ్లి తండ్రికి అప్పగించాడు రామ్ చరణ్. ప్రస్తుతం హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. కొన్నేళ్లుగా సినిమా నిర్మాణం కూడా చేస్తున్నాడు మెగా వారసుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టి తండ్రితో వరస సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఖైదీ నెంబర్150 ఈ బ్యానర్ నుంచి వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏకంగా 200 కోట్లతో సైరా నరసింహారెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు మెగా పవర్ స్టార్. ధ్రువ సినిమా చేస్తున్న సమయంలో ఖైదీ నెంబర్150 కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేసుకొని నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాడు రామ్ చరణ్.
ఇక సైరా సినిమాను కూడా దాదాపు ఏడాది పాటు అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈయన రాజమౌళి సినిమాతో బిజీగా ఉండటంతో సైరా నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం అంత ఈజీ కాదు. పైగా అక్కడ ఉన్నది రాజమౌళి.. కాబట్టి ఆయన సినిమా చేస్తున్న సమయంలో మరో సినిమాపై దృష్టి పెట్టడం కష్టమే. దాంతో నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకొని వాటిని తండ్రి చిరంజీవికి అప్పగించాడు మెగా వారసుడు. ఇప్పటికే సైరా రెగ్యులర్ షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికితోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ప్రస్తుతానికి మిగిలిపోయిన పనులన్నింటినీ చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆయనకు నాగబాబు కూడా సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సైరా బాధ్యతలు ప్రస్తుతం చిరంజీవి తీసుకున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది.

More Related Stories