మారుతి ధరమ్ తేజ్ ఇక ప్రతి రోజూ పండగే

చిత్రలహరితో హిట్ కొట్టి ఫాంలోకి వచ్చిన మెగా హీరో సాయిధరమ్ తేజ్, శైలజా రెడ్డి అల్లుడుతో డీలా పడిన క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై ఇప్పటి దాకా అఫీషియల్ ప్రకటన రాకపోయిన, ప్రాజెక్టుకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈరోజు ఆ ప్రచారాలని నిజం చేస్తూ ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటోంది. నిజానికి ఈ సినిమా పేరు గురించి, హీరోయిన్ గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. ముందుగా ఈ సినిమాకి భోగి అనే టైటిల్ని ఫిక్స్ చేయాలని మేకర్స్ భావించారని కానీ నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ప్రతి రోజు పండగే అనే టైటిల్ని పెట్టాలని ఫైక అయ్యారని ప్రచారం జరిగింది.ప్రచారం జరిగినట్టే అదే పేరుతో సినిమా మొదలు పెట్టారు. ఇక గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇంతకుముందు 'భలేభలే మగాడివోయ్' ఈ బ్యానర్ల కలయికలోనే రూపొందగా, మళ్లీ మారుతి అదే బ్యానర్ లో రెండవ చిత్రంగా దీనిని చేస్తున్నారు. ఇక సాయి ధరమ్కి జోడీగా రాశీఖన్నా రెండో సారి నటించనుంది. ఇంతకుముందు సుప్రీమ్ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఇక ఈ సినిమాని 2020 సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు. థమన్ సంగీతమందిస్తున్న ఈ హీరో తండ్రి పాత్ర కీలకం అని సమాచారం. సాయి ధరమ్ కి తండ్రి గా రావు రమేష్ ని మారుతి ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు అంటున్న్నారు.