కల్కి ట్రైలర్.. రాజశేఖర్ ఈజ్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్..

ఒక్క సినిమా చాలు మర్చిపోయిన హీరోను మళ్ళీ గుర్తు చేయడానికి.. అదే ఒక్క సినిమా చాలు బాగా గుర్తున్న వాళ్లను మరిచిపోయేలా చేయడానికి. రాజశేఖర్ విషయంలో మొదటిది జరిగింది. రాజశేఖర్ అంటూ ఒక హీరో ఉన్నాడని చాలా ఏళ్ల క్రితమే ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ 2017లో వచ్చిన గరుడవేగ సినిమా ఈయన ఉన్నాడంటూ మళ్లీ ప్రేక్షకులను గుర్తు చేసింది. ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన చిత్రం కమర్షియల్ గా విజయం సాధించకపోయినా కూడా రాజశేఖర్ కు నటుడిగా మరో బ్రేక్ ఇచ్చింది. చాలా ఏళ్ల తర్వాత ఆయన నటించిన సినిమా థియేటర్ లోకి వచ్చి కనీసం వారం రోజులు ఉంది. డబ్బుల విషయం పక్కన పెట్టినా కూడా నటుడిగా రాజశేఖర్ ను మళ్ళీ పుట్టించింది గరుడ వేగ. ఇప్పుడు ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో మరో సినిమాతో వస్తున్నాడు ఈ హీరో.. అదే కల్కి.
ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు. ఇది చూసిన తర్వాత రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనాలనిపిస్తుంది. 1983 తెలంగాణ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అ..! సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. ఈ చిత్రం కోసం మరోసారి భారీ బడ్జెట్ పెడుతున్నారు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. హనుమంతుడు దారి మాత్రమే చూపిస్తాడు.. యుద్ధం చేయాల్సింది రాముడే అంటూ వచ్చే డైలాగులు కూడా అదిరిపోయాయి. మర్డర్ మిస్టరీగా ఈ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. గరుడవేగ రాజశేఖర్ మార్కెట్ కు మించి డబ్బులు పెట్టడం వల్లే ఫ్లాప్ అయిందని.. కానీ ఇప్పుడు కల్కి మాత్రం కచ్చితంగా కమర్షియల్ హిట్ అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు రాజశేఖర్. మరి ఈ చిత్రంతో రాజశేఖర్ కమర్షియల్ గా విజయం సాధిస్తాడో లేదో చూడాలి.