English   

చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడా...

Chiranjeevi
2019-06-26 17:09:39

పదేళ్ల కింద ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పోటీపడి మరీ ప్రజారాజ్యం పార్టీ చాలా నియోజకవర్గాల్లో బలమైన ప్రత్యర్థిగా నిలిచింది. అయితే ఓట్ల దగ్గర సంచలనం సృష్టించినా సీట్ల విషయంలో మాత్రం వెనకబడి పోయింది ప్రజారాజ్యం. కేవలం 17 సీట్లకు పరిమితం అయిపోయి చిరంజీవికి దారుణమైన పరాభవాన్ని ఎదురయ్యేలా చేసింది. దాంతో సినిమా ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో మాత్రం పూర్తిగా వెనుకబడి పోయాడు. ఆ తర్వాత రెండేళ్లకు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి అప్పటి నుంచి అదే పార్టీలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మధ్యలో కేంద్రమంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా కొన్నాళ్లపాటు సేవలు అందించాడు. 2018 మార్చితో రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తికావడంతో చిరంజీవి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్రీ అయిపోయాడు. ఇప్పుడు కేవలం ఆ పార్టీలో ఒక సభ్యుడిగా మాత్రమే ఉన్న మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి తో పాటు కొరటాల శివ, బోయపాటి శ్రీను సినిమాలను కూడా కన్ఫర్మ్ చేశాడు చిరంజీవి. ఇలాంటి సమయంలో ఆయన మళ్లీ రాజకీయాల వైపు వస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అతడు ఎంతగా రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఆయన్ని మరోసారి పాలిటిక్స్ వైపు తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఇతర పార్టీ నేతలను తమ పార్టీలో కలుపుకుంటున్న బిజెపి చిరంజీవిపై కూడా కన్నేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తర్వాత అంతటి చరిష్మా, మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి తమ పార్టీలోకి వస్తే ఎప్పటికీ కాదనలేము అంటున్నారు బీజేపీ పెద్దలు. ఆయన రాక కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు చిరంజీవి. బిజెపిలోకి వెళ్లే ప్రసక్తే లేదని.. ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో తెలియదు అంటూ ఖండిస్తున్నాడు మెగాస్టార్. ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఎలాంటి ఆక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. దాంతో పూర్తిగా సినిమాలకు మాత్రమే పరిమితం అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి సమయంలో బీజేపీకి ఆహ్వానించిన కూడా వెళ్లడని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.. నిజంగానే చిరంజీవి కమలం గూటికి చేరుతాడా లేదంటే హస్తంలోనే ఉండిపోతాడా అనేది కాలమే నిర్ణయించాలి.

More Related Stories