English   

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మృతి

vijaya
2019-06-27 06:44:30

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. ఇక ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న పొద్దుపోయాక గుండెపోటుతో మరణించారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. విజయ నిర్మల అసలు పేరు నిర్మల కాగా తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా విజయ నిర్మలగా పేరు పెట్టుకున్నారని చెబుతూ ఉంటారు. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల. ఇక ఈమె నటుడు నరేశ్‌కు తల్లి కాగా నటి జయసుధకు పిన్ని అని సమాచారం. 1950లో మత్య్సరేఖ తమిళ చిత్రం ద్వారా విజయనిర్మల తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక ఆ సినిమా నుండి సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె ‘మీనా’ అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా అప్పటి నుంచి 2009లో వచ్చిన నేరము శిక్ష సినిమా దాకా మొత్తం 44 సినిమాలు తీశారు.  విజయనిర్మల నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణనే కావడం మరో ఆసక్తికర అంశం. ఇక తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు. ఇక మహేష్ బాబుకు ఈమె సొంత తల్లి కాకున్నా మహేష్ కుటుంబం అంతా కలిసే ఉంటుంది కాబట్టి వీరి మధ్య అనుబంధం ఎక్కువే. ఒక రకంగా కృష్ణ - మహేష్ కుటుంబానికి ఇది తీరని లోటు అని చెప్పొచ్చు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

More Related Stories