కృష్ణతో కలిసి విజయనిర్మల నటించిన సూపర్ హిట్ సినిమాలివే..

విజయనిర్మల అంటే మరో మాట లేకుండా గుర్తొచ్చే మరో పేరు కృష్ణ. సూపర్ స్టార్ తో జీవితాన్ని పంచుకోవడమే కాదు.. ఎన్నో సినిమాల్లో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది. ఒకటి రెండు కాదు.. 47 సినిమాల్లో కలిసి నటించారు ఈ జంట. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయనిర్మల కెరీర్ ను మార్చేసిన అన్ని సినిమాల్లోనూ కృష్ణ కీలక పాత్ర పోషించారు. 1967లో బాపు తెరకెక్కించిన సాక్షి సినిమాతో ఈ జంట తొలిసారి స్క్రీన్ పై కనిపించారు. ఆ సినిమా సాక్షిగా తర్వాత పెళ్లి చేసుకున్నారు. సాక్షి తర్వాత ఈ జోడీకి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. దాంతో దర్శక నిర్మాతలు కూడా కృష్ణ, విజయనిర్మల డేట్స్ కోసం ఎగబడ్డారు. ఇక కేయస్ఆర్ దాస్ తెరకెక్కించిన యాక్షన్ సినిమా మోసగాళ్లకు మోసగాడు కూడా ఈ జంటకు తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన తొలి కౌబాయ్ చిత్రం కూడా ఇదే.
యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు.. తాము కుటుంబ కథా చిత్రాలు కూడా చేస్తామని నిరూపించిన చిత్రం పండంటి కాపురం. లక్ష్మీదీపక్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఎన్టీఆర్, కృష్ణ నటించిన మల్టీస్టారర్ సినిమా దేవుడు చేసిన మనుషులులో కూడా విజయనిర్మల కీలక పాత్రలో నటించింది. తొలిసారి విజయనిర్మల దర్శకత్వం వహించిన సినిమా మీనా. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇందులో కూడా కృష్ణ హీరోగా నటించాడు. ఇదే సినిమాను ఆధారంగా చేసుకుని త్రివిక్రమ్ అ..ఆ సినిమా తెరకెక్కించాడు. విజయ నిర్మల కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా అల్లూరి సీతారామరాజు ప్రత్యేకం. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులకు తెరతీసింది. ఈ సినిమాలో వస్తాడు నా రాజు అంటూ విజయనిర్మల పాడిన పాట ఇప్పటికీ అందరికీ గుర్తుంది... ఎప్పటికీ గుర్తుండిపోతుంది కూడా. ఇక పాడిపంటలు, మంచివాళ్లకు మంచివాడు, దేవదాసు, సాహసమే నా ఊపిరి లాంటి సినిమాల్లో కూడా విజయనిర్మల తన భర్తతో కలిసి నటించారు.