English   

విజయ నిర్మల మృతి...చిరంజీవి సంతాపం

 Chiranjeevi
2019-06-27 12:53:22

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి విజయనిర్మల ఈరోజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ఆమె మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. విజయనిర్మల లాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని , ఆమె లేని లోటు యావత్తు సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖ ప్రకారం అరుదైన దర్శక నటీమణి శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, మన తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయనిర్మల గారనీ తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారని చిరు పేర్కొన్నారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటిచెప్పారని, అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని అన్నారు.  కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారని, ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్‌ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్‌‌కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు.  

More Related Stories