మహర్షి సంబరాలు వాయిదా...విషాదంలో వద్దనే !

మహేష్ బాబు కెరీర్ లో మైలు రాయి లాంటి 25వ సినిమాగా వచ్చిన మహర్షి ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ రేపు హైదరాబాద్ శిల్పకళావేదికలో జరపాలని ప్లాన్ చేశారు. ఊపిరి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మూడేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఈరోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా ఇప్పటికి 200 సెంటర్స్ లో ఆడుతుండడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. కాని ప్రముఖ నటి, దర్శకురాలు మహేష్ చిన్నమ్మ విజయ నిర్మల హఠాన్మరణంతో వేడుకని వాయిదా వేస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. విజయ నిర్మల అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరగనుండగా మహేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ అక్కడ హాజరు కానున్నారు. అందుకే మహర్షి 50 రోజుల వేడుక వాయిదా పడినట్టు తెలుస్తుంది .