పదిహేనేళ్ళకి కలుసుకున్న ప్రేమ జంట !

రియల్ ప్రేమ జంట కాదు లెండి, రీల్ ప్రేమ జంట. 2004 అక్టోబర్లో '7జి రెయిన్బో కాలని' పేరుతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక సినిమా సూపర్ హిట్ అయింది. దానినే '7జి బృందావన కాలని' పేరుతో తెలుగులో డబ్బింగ్ చెప్పించి విడుదల చేస్తే అది కూడా సూపర్ హిట్ కొట్టింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా స్వరపరచిన పాటలన్నీ అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఈ సినిమా బెంగాలీ, ఒడియా, కన్నడ భాషల్లోనూ రీమేక్ అయి ఆదరణ పొందింది. కన్నడంలో 'గిల్లి' పేరుతో రూపొందిన ఆ సినిమా ద్వారానే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. అయితే అలాంటి ఈ సినిమాను టి సిరీస్ తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ హిందీలో నిర్మిస్తున్నారు. మంగేశ్ హద్వాలే ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. జావెద్ జెఫ్రీ తనయుడు మిజాన్ జఫ్రీ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆ విషయాలు పక్కన పెడితే 7/జి బృందావన కాలనీలో లీడ్ రోల్స్ లో నటించిన రవి కృష్ణ, సోనియా అగర్వాల్ ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. ఐతే తరువాత వీరు చేసిన సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో చిన్నగా ఇద్దరు సినిమాలకు దూరమయ్యారు. కాగా ఈ సినిమా విడుదలైన 15 ఏళ్ల తర్వాత ఈ జంట తాజాగా కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి ఈ సినిమా తెరకెక్కించిన సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడిన సోనియా ఆయనని వివాహం కూడా చేసుకున్నారు. కానీ విభేదాలు రావడంతో వారు తర్వాత రోజుల్లో విడిపోయారు.