English   

లయన్ కింగ్ ట్రైలర్ అదిరింది.. కానీ నాని వాయిస్ ఎక్కడ..

 The Lion King
2019-07-02 12:19:05

జంగిల్ బుక్ సినిమా తర్వాత హాలీవుడ్ సినిమాలకు మరోసారి ఇండియాలో స్వర్ణ యుగం మొదలైంది. అప్పటి నుంచి చాలా సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టిస్తున్నాయి. ఒక్కో సినిమా కనీసం 300 నుంచి 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. మొన్న విడుదలైన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్  ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమాలకు కూడా ఊహించని షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు జంగిల్ బుక్ దర్శకుడి నుంచి వస్తున్న మరో అద్భుతమైన విజువల్ వండర్ లయన్ కింగ్. ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం జగపతిబాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ లాంటివాళ్ళు  తమ స్వరాన్ని అరువిచ్చారు. ఇక సినిమాలో ఉన్న ప్రధాన పాత్ర కోసం నాని  డబ్బింగ్ చెప్పాడు.  జూలై 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో జగపతి బాబు, రవి శంకర్ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. బ్రహ్మానందం, అలీ తో పాటు ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పిన నాని వాయిస్ కూడా వినిపించలేదు. ఇదే అభిమానులకు ఇప్పుడు నిరాశ కలిగించే విషయం. ఒక పెద్ద అడవిని పాలించే సింహం వయోభారంతో రాజ్యభారం నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తుంది.. ఆ సమయంలో తన వారసుడిగా యువ సింహాన్ని అడవి నీతి నేర్పించి సింహాసనంపై కూర్చోబెడుతుంది. ఏమీ తెలియని ఆ కుర్ర సింహం మిగిలిన జంతువుల నుంచి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంది.. ఎలా రాజ్యంలో తనదైన ముద్ర వేయగలిగింది అనేది లయన్ కింగ్ కథ. జంగిల్ బుక్ మాదిరి మరోసారి ఈ సినిమాతో మరో ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాలని చూస్తున్నాడు దర్శకుడు. దానికి తోడు నాని, జగపతి బాబు, బ్రహ్మానందం,అలీ ఉండటంతో తెలుగు సినిమా చూస్తున్న భావనే ప్రేక్షకులకు రానుంది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు విడుదలైన ట్రైలర్ లో నాని వాయిస్ కూడా ఉండుంటే అతని అభిమానులు సంతోషించేవారు. కానీ సినిమా విడుదలయ్యేంత వరకు సస్పెన్స్ గా ఉంచాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories