అఖిల్ అక్కినేనికి పాపం ఇప్పుడే అన్ని కష్టాలేంటో మరి..?

కొందరు హీరోలకు కష్టాలు బ్యాక్ పాకెట్ లోనే ఉంటాయి. అఖిల్ అక్కినేని అందులో అందరికంటే ముందు వరసలో ఉంటాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ హీరో.. తొలి సినిమా నుంచే నిరాశ పరచడం మొదలు పెట్టాడు. వినాయక్ తెరకెక్కించిన అఖిల్.. ఆ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో.. వెంకీ అట్లూరి చేసిన మిస్టర్ మజ్ను.. ఇలా వచ్చిన సినిమాలన్నీ వచ్చినట్లు చాప చుట్టేసాయి. దాంతో ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈయనకు ప్రతీ సినిమా విషయంలో ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది. అదే హీరోయిన్స్ ప్రాబ్లమ్. అఖిల్ లో సయేషా సైగల్.. హలోలో కళ్యాణి ప్రియదర్శన్.. మిస్టర్ మజ్నులో నిధి అగర్వాల్ తో జోడీ కట్టాడు అఖిల్ అక్కినేని.
ప్రతీ సినిమాలోనూ ఈయనతో జోడీ కట్టడానికి స్టార్ హీరోయిన్లు దొరకడం లేదు. మిగిలిన వారసులకు ఈజీగానే స్టార్ హీరోయిన్లు సెట్ అవుతున్నా.. ఒక్క అఖిల్ విషయానికి వచ్చేసరికి మాత్రం అన్ని సమస్యలు కలిసికట్టుగా వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు కొత్త హీరోయిన్లతోనే సర్దుకుపోతూ వచ్చాడు అఖిల్ అక్కినేని. ఇక ఇప్పుడు కూడా నాలుగో సినిమాలో కూడా ఈయనతో జోడీ కట్టడానికి స్టార్ హీరోయిన్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే కియా అద్వానీతో పాటు రష్మిక మందనన్ను కూడా అడిగినా జోడీ కుదర్లేదని ప్రచారం జరుగుతుంది. మరి ఈ చిత్రంలో అయినా అఖిల్ స్టార్ హీరోయిన్ తో జోడీ కట్టి తన లక్ మార్చుకుంటాడేమో చూడాలిక.