English   

మన హీరోలు లింగుస్వామితో ఎందుకు ఆడుకుంటున్నారు..

 lingusamy
2019-07-02 18:10:01

లింగుస్వామి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో వి.వి.వినాయక్ కు ఎంత ఇమేజ్ ఉండేదో తమిళనాట లింగస్వామికి కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన ఒకప్పుడు సినిమా చేశాడు అంటే రికార్డులు బద్దలు అయిపోవాల్సిందే. విశాల్ లాంటి హీరోలతో కూడా ఇండస్ట్రీ రికార్డులు కొట్టించిన సత్తా లింగుస్వామి సొంతం. మూడేళ్ల కింది వరకు ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించాయి. కానీ సూర్యతో చేసిన సికిందర్ తర్వాత లింగుస్వామి పూర్తిగా గాడి తప్పాడు. ఇప్పుడు తెలుగులో వినాయక్ సినిమాలకు ఎన్ని కష్టాలు వచ్చాయో తమిళనాట లింగ స్వామికి కూడా అంతే. అయితే మరీ తీసి పారేసే సత్తాలేని దర్శకుడు కాదు లింగుస్వామి. ఈ విషయం తమిళ హీరోలకు కూడా తెలుసు. కాకపోతే అక్కడ వాళ్ళు ఎవరూ కూడా ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమా చేసే ఆసక్తి చూపించడం లేదు. ఇదే సమయంలో తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో కలలు కంటున్నాడు లింగుస్వామి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కొత్త సినిమాకు ముహూర్తం కూడా పెట్టాడు. గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ తో పాటు స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నాయని అప్పట్లో అఫీషియల్ ప్రకటన కూడా వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా పట్టాలెక్కక ముందే అటకెక్కేసింది. దాంతో లింగుస్వామిని పట్టించుకునే నాథుడే తెలుగు ఇండస్ట్రీలో కరువై పోయాడు. చివరికి ఇప్పుడు ఈ దర్శకుడు హవీష్ హీరోగా సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తెలిసి నిజంగానే అందరూ షాక్ అవుతున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో సినిమాలు చేయాల్సిన లింగుస్వామి ఏంటి.. కనీసం గుర్తింపు కూడా లేని లాంటి హీరోలతో సినిమా చేయడం ఏంటి అంటూ బాధ పడుతున్నారు. ఏదేమైనా ఇది సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ జాలి దయ అనేది అస్సలు ఉండవు. ఫ్లాప్ వచ్చిందంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయిన తీసుకెళ్లి పక్కన పడేస్తారు. ఇప్పుడు లింగుస్వామి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కనీసం నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు ఈ దర్శకుడికి మన హీరోలు. మరి ఈయన మళ్ళీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడో చూడాలి.

More Related Stories