English   

ముంబై ఎయిర్ పోర్ట్ లో చిక్కుకున్న రకుల్

 Rakul Preet
2019-07-02 18:26:23

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనాలు మృత్యువాత పడుతున్నారు. గోడలు కూలి కొందరు, చలి తీవ్రతకి మరి కొందరు చనిపోతున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తం కాగా, ఆ ప్రభావం విమానాల రాకపోకల మీద కూడా పడింది. ముంబై విమానాశ్రయం పరిసరాల్లో కురుస్తున్న ఏకధాటి కుంభవృష్టి వర్షంతో రన్ వే మీద భారీ ఎత్తున నీరు చేరింది. అందునా ఓ విమానం రన్ వే మీద నీటిలో చిక్కుకుపోయి కదలకుండా నిలిచిపోయింది. ఇదే సమయంలో రెండో రన్ వే సైతం వర్షపు నీటితో నిండటంతో నిన్నటి నుండి 54 విమానాలను దారిమళ్లించాల్సి వచ్చింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, దుబాయ్, కోల్ కతా, హైదరాబాద్, గోవా తదితర ప్రాంతాల నుంచి రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. ముంబైకి నడపాల్సిన సర్వీసులను కూడా కొన్ని సంస్థలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ క్రమంలో సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విమానాశ్రయంలో చిక్కుకుందని సమాచారం. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది. ముంబై ఎయిర్‌ పోర్ట్‌ తెరిచి ఉందో లేదో ఎవరైనా సమాచారం అందిస్తారా? అంటూ బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ముంబై పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేయగా, దానికి రకుల్ సమాధానం ఇచ్చింది. నిన్న రాత్రి నుంచి ఒక్క విమానం కూడా కదల్లేదని, తాను కూడా అందుకే ఎయిర్‌ పోర్ట్‌ లోనే చిక్కుకున్నానని చెప్పింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో మహారాష్ట్ర వాసులు ఆందోళనలో ఉన్నారు.  

More Related Stories