అనంతపురంలో వాల్మీకితో ఆడుకున్నారుగా.. వరుణ్ తేజ్ కు షాక్..

వాల్మీకి అనే టైటిల్ పెట్టినపుడే కచ్చితంగా వివాదాలు వస్తాయని హరీష్ శంకర్ కు తెలుసు. కానీ తన కథకు ఇదే సరిపోతుందని భావిస్తున్నాడు ఈయన. ఎవరు ఎంతగా చెప్పినా కూడా తను మాత్రం అదే టైటిల్ పెడతానని ముందుకెళ్తాడు ఈ దర్శకుడు. పైగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని హరీష్ శంకర్ చేస్తున్న సినిమా వాల్మీకి. తమిళనాట విజయం సాధించిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్. వరుణ్ తేజ్, పూజా హెగ్డే ఇందులో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం తన కెరీర్ గాడిలో పడాలంటే కచ్చితంగా ఈ సినిమా విజయం సాధించాలి. గబ్బర్ సింగ్ తర్వాత ఆ స్థాయి విజయం హరీష్ శంకర్ కు రాలేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే లాంటి సినిమాలు జస్ట్ ఓకే అనిపించాయి కానీ సూపర్ హిట్ కాలేదు. దాంతో ఇప్పుడు ఈయనను స్టార్ హీరోలు నమ్మాలి అంటే కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. అందుకే వాల్మీకి పని మొదలు పెట్టాడు హరీష్ శంకర్.
ఈ సినిమా ఖచ్చితంగా తాను కోరుకున్న విజయం తీసుకొస్తుందని ధృడంగా నమ్ముతున్నారు హరీష్. ఇప్పటికే షూటింగ్ కూడా సగం పూర్తయింది. ఈ మధ్యే విడుదలైన ప్రీ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతా బాగానే ఉంది కానీ వాల్మీకి షూటింగ్ కోసం అనంతపురం వెళ్లిన టీంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. వాల్మీకి లాంటి గొప్ప వ్యక్తి పేరును హింసాత్మక సినిమాకు పెడతారా అంటూ ఆ సినిమా షూటింగ్ జరగకుండా అడ్డుకున్నారు నిరసనకారులు. దాంతో చేసేదేం లేక వెనుదిరిగారు చిత్రయూనిట్. దేవి శ్రీ ప్రసాద్ వాల్మీకి సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. వరస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో మరో విజయం అందుకుంటారని ధీమాగా చెబుతున్నాడు. దానికి తోడు మెగా హీరోలు హరీష్ శంకర్ కు బాగానే కలిసి వచ్చారు. మొత్తానికి చూడాలిక.. వాల్మీకి వివాదాలు ఎలా పరిష్కారం కానున్నాయో..?