పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగొద్దు.. మీడియాపై జీవిత సీరియస్..

కల్కి సినిమా ఊహించిన విజయం సాధించలేదు. ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్న దర్శక నిర్మాతలకు ఇది షాక్ ఇస్తుంది. తొలిరోజే టాక్ తేడాగా రావడంతో సినిమా అంచనాలు అందుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మీడియాపై సీరియస్ అయింది నిర్మాత జీవిత రాజశేఖర్. తాజాగా కల్కి సినిమా ప్రెస్ మీట్ జరిగింది. అక్కడికి వచ్చిన మీడియా మిత్రులు జీవితాను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఈ చిత్ర దర్శకత్వంలో కూడా వేలు పెట్టారంట కదా.. నిజమేనా అంటూ అడిగేసాడు. దాంతో వెంటనే జీవితా కూడా ఫైర్ అయింది. అసలు ఇలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారంటూ సీరియస్ అయిపోయింది. అడిగే పద్దతి కూడా తెలియాలి కదా.. అలా ఎలా ప్రశ్నిస్తారంటూ ఆ జర్నలిస్టుతో ఆడుకుంది జీవిత. అడగడానికి కూడా ఓ పద్దతి ఉంటుంది.. మీరు దర్శకుడికి సలహాలు ఇచ్చారా అని అడగడం ఓ పద్దతి కానీ వేలు పెట్టడం ఏంటండీ అంటూ ఫైర్ అయింది ఈమె.
అవును.. నేను కూడా దర్శకురాలినే.. పైగా ఈ చిత్రం కోసం 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టాను.. అలాంటప్పుడు సినిమా ఎలా వస్తుంది.. ఎలా ఉండబోతుంది.. అది తమకు నచ్చుతుందా లేదా అని చూసుకునే అర్హత లేదా అంటూ ప్రశ్నించింది. అన్ని కోట్లు పెట్టిన నిర్మాతకు కచ్చితంగా సినిమా గురించి ఆరా తీసి.. అనుమానాలు వచ్చినపుడు సలహాలు ఇచ్చే అధికారం కూడా ఉంటుందని చెప్పింది ఈమె. అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతపైనే ఉంటుంది కదా అంటూ రివర్స్ కౌంటర్ వేసింది జీవిత. ఈమె మాటలతో అక్కడున్న మీడియా కూడా షాక్ అయిపోయింది. ఉన్నట్లుండి సీరియస్ కావడంతో వాతావరణం కూడా వేడెక్కిపోయింది. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తనకు ఏ సినిమా పరిస్థితి ఏంటి.. ఎలా వస్తుంది.. ఎలాంటి సలహాలు ఇవ్వాలని తెలియదా అంటూ సీరియస్ అయింది జీవితా. ఏదేమైనా ఇప్పుడు ఈమె మాటలను బట్టి చూస్తుంటే ప్రశాంత్ వర్మకు జీవితా నుంచి కూడా చాలా వరకు ఇన్ పుట్స్ వచ్చాయని అర్థమవుతుంది.