ఖాళీగా కాలం వెల్లదీస్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్.. అయ్యో పాపం..

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదంటే ఇదే కాబోలు. బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినా కూడా ఇప్పటికీ హీరోలు ఎవరూ ఆ దర్శకుడి వైపు చూడటం లేదు. ఇంతకీ ఎవరా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు.. గతేడాది బాక్సాఫీస్ ను షేక్ చేసిన గీతగోవిందం దర్శకుడు పరుశురామ్. ఈయన తర్వాతి సినిమాపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అంత పెద్ద విజయం అందించిన తర్వాత కూడా ఎందుకో తెలియదు కానీ పరుశురామ్ ఖాళీగా ఉన్నాడు. ఆ మధ్య ఈయనతోనే మంచు విష్ణు తర్వాతి సినిమా ఉండబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇది అబద్ధమని పరుశురాం క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే గీతాఆర్ట్స్ లోనే తర్వాతి సినిమాకు కూడా కమిటయ్యాడు ఈ దర్శకుడు. అయితే హీరో మాత్రం ఇంకా ఎవరో తెలియకపోవడంతో ఎదురు చూపులు చూస్తూనే ఉన్నాడు పరుశురామ్. గీతగోవిందం సక్సెస్ రేంజ్ చూసిన తర్వాత కూడా ఈయన వైపు ఎవరూ రాకపోవడం ఆశ్చర్యమే. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో తర్వాతి సినిమా చేసి స్టార్ డైరెక్టర్ అయిపోవాలని కలలు కంటున్నాడు పరుశురామ్. అయితే వాళ్లెవరూ ఇప్పుడు పరుశురాంతో చేయడానికి ఖాళీగా లేరు. ప్రతీ ఒక్కరు కనీసం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ లెక్కన పరుశురాం నెంబర్ వచ్చేలోపు ఏ మూడు నాలుగేళ్లు అయిపోతుంది. మరి ఆ లోపు వేరే హీరోతో సినిమా చేస్తాడేమో చూడాలిక.