జైళ్ళకి వెళ్లినోళ్లె హాపీగా తిరుగుతున్నారు...తానా సభల్లో పవన్

వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న తానా వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనడానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. తానా మహాసభల రెండో రోజు సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ క్రమంలో ఆయన ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులే ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నప్పుడు ఏ తప్పూ చేయని తాను ఎందుకు బాధపడాలని పరోక్షంగా జగన్ ని విమర్శించారు. ఓటమి నుండి విజయాన్ని అందుకోవడం బల్బు కనిపెట్టిన ఎడిసన్ నుండి తాను నేర్చుకున్నానని పేర్కొన్నారు. తనకు ఓర్పు ఎక్కువని, ఎన్ని అడ్డంకులు కష్టాలు ఎదురైనా విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తానని, సమాజం విచ్ఛిన్నం కాకుండా చేసే ఏకైక సాధనం మంచి రాజకీయాలు మాత్రమేనని ఆయన వెల్లడించారు. తానా సభలకు వెళ్లవద్దని చెబుతూ ఏవేవో కారణాలు తనకు చెప్పారని, కానీ కులాల కోసం విడిపోవడం కన్నా సమాజం కోసం రేపటి తరం కోసం విలువలతో కూడి అందరం కలిసి నడక సాగించాలనే తాను తానాకు వస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు ఈ వేడుకల్లో ఆనందంగా పాల్గొంటున్నానని పవన్ చెప్పుకొచ్చాడు. జనసేన ఓటమి తర్వాత.. ఆ పరాజయాన్ని జీర్ణించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాలే పట్టిందన్న పవన్, తాను డబ్బు పంచి ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసని ఆ డబ్బు లేని రాజకీయాలు తేవడమే తన లక్ష్యం అని ఆయన అన్నారు.