తానా మహాసభల్లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ నోటి నుంచి చురుకైన మాటలు వినడం లేదు. ఆయన ఎవరినీ పెద్దగా విమర్శించడం లేదు. ఓటమి తర్వాత తనను తాను ఎందుకు ఓడిపోయానని విశ్లేషించుకుంటున్నాడు. దానికోసమే పార్టీ మీటింగ్, రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్నాడు పవర్ స్టార్. ఇక సినిమాలకు పూర్తిగా సెలవు ఇచ్చేసి రాజకీయల్లోనే ఉంటానని పదే పదే చెబుతున్నాడు జనసేనాని. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన ఉత్తర అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలకు వచ్చాడు. అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు అండగా ఉండాలని.. అదే చేస్తున్నాను.. అదే ఇకపై చేస్తాను కూడా.. రాబోయే పాతికేళ్లు తాను ప్రజలతోనే ఉంటాను అని మరోసారి స్పష్టం చేసాడు పవన్ కళ్యాణ్. అయినా నేనేం తప్పు చేయలేదు.. జైలుకెళ్లి నేనేం కూర్చో లేదు కదా.. అలాంటి వాళ్లకు లేని ఇబ్బంది నాకేంటి అని అని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్.
నేనేమీ స్కాములు చేయలేదు.. ద్రోహం చేయలేదు ప్రజలకు అండగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చాను.. అదే చేస్తాను అంటూ పవన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సభ తర్వాత ఎవరు ఏమనుకున్నా తనకేం సంబంధం లేదని చెప్పాడు పవర్ స్టార్. ఓటమి అనే భయంతో తాను రాజకీయాల్లోకి రాలేదని.. విలువల కోసం వచ్చానని వాటికి కట్టుబడి ఉంటారని చెబుతున్నారు జనసేనాని. అయినా జనసేన పార్టీ ఓడిపోతుందని తనకు ముందే తెలుసని.. ఆ ఓటమి గురించి కూడా తను పెద్దగా ఆలోచించ లేదని చెప్పాడు పవన్ కళ్యాణ్. తను ఓడిపోయిన విషయాన్ని కేవలం 15 నిమిషాల్లో మరిచిపోయానని.. తర్వాత ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టానని చెప్పాడు ఈయన. అభిమానులు కూడా ఎక్కువగా మనసుకు తీసుకోకుండా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలో ఆలోచించాలి అని చెప్పాడు పవన్ కళ్యాణ్. మొత్తానికి స్కాములు, ద్రోహులు, జైలు అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే విమర్శనాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్.