తమ్ముడు దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండకు చివాట్లు..

విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా ఈయన్ని తన మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచాడంటే అర్థం చేసుకోవచ్చు మనోడి రేంజ్. అలాంటి హీరో తమ్ముడు హీరోగా పరిచయం అవుతుంటే కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ పడ్డాడు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసిన విజయ్.. ఇప్పుడు మనం చూసిన విజయ్ వేరుగా ఉన్నాడంటూ అంతా పరేషాన్ అవుతున్నారు. ఏ విషయం అయినా కూడా నేరుగా సుత్తి లేకుండా సూటిగా చెప్పే అలవాటున్న విజయ్.. తమ్ముడి సినిమా వేడుకలో మాత్రం తడబడ్డాడు. దొరసాని సినిమా ప్రమోషన్స్‌కి ఎప్పటికప్పుడు తనకు రావాలని అనిపించినా కూడా ఆపుకున్నానని చెప్పాడు విజయ్.
పాటలు వచ్చినపుడు కూడా షేర్ చేయడానికి కూడా ఆలోచించానని.. ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో వాడికి తెలియాలని కామ్ గా ఉన్నానని చెప్పాడు విజయ్. అందుకే ఇప్పటి వరకు తమ్ముడి సినిమాను పట్టించుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అసలు విజయ్ ను ఇలా ఎమోషనల్ గా ఎప్పుడూ చూడని ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. కానీ ఇది అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మాత్రం అంతా ఇప్పుడు విజయ్ తో పాటు ఆనంద్ దేవరకొండను కూడా ఆడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ లాంటి హీరో కూడా ఏడ్చినట్లు నటించడం ఏం బాలేదంటున్నారు కొందరు. ఆనంద్ దేవరకొండలో విషయం ఉంటే ఉంటాడు లేదంటే వెళ్లిపోతాడంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మొత్తానికి విజయ్ ఏడుపు అభిమానులను కదిలించినా నెటిజన్లను మాత్రం ట్రోలింగ్ కోసం వాడుకునేలా చేసింది..