సైరా కోసం మరో బాలీవుడ్ టెక్నీషియన్ ని రోప్ చేసిన చరణ్

చిరంజీవి హీరోగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్‌రెడ్డి దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నయనతార నటిస్తోంది. చిరు సతీమణి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద ఆయన కొడుకు రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాడలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి మొదట రెహమాన్ సంగీతం అందించాల్సి ఉండగా ఆయన అనూహ్యంగా తప్పుకోగా ఇప్పుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి మరో బాలీవుడ్ సాంకేతిక నిపుణుడు పని చేస్తున్నారు. ఆయనే జులియజ్ పక్కియమ్. ఆయన ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందించనున్నారు. బాలీవుడ్ చిత్ర సీమలో బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ గా ఈయనకు మంచి పేరుంది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘ఏక్ థా టైగర్’, ‘కిక్’, ‘భజరంగీ భాయిజాన్’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, తాజా ‘భారత్’ చిత్రాలకు, అలాగే ‘ధూమ్ 3’, ‘బాఘీ’ సిరీస్‌కు జూలియస్ నేపథ్య సంగీతం అందించారు. ఈ మధ్యనే వచ్చిన సల్మాన్ ఖాన్ భారత్ సినిమాకి ఆయన అందించిన నేపథ్య సంగీతం రామ్‌చరణ్‌కు నచ్చడంతో సైరాకు ఆయనని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక అమితాబచ్చన్, తమన్నా, విజరు సేతుపతి, కిచ్చ సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ రెండున ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంగా విడుదల కానుంది.