వర్మ మేనకోడలికి దిల్ రాజు సపోర్ట్ !

‘హైదరాబాద్ బ్లూస్’, ‘ఇక్బాల్’ లాంటి ఇండిపెండెంట్ సినిమాలు తెరకెక్కించి బాలీవుడ్ లో తనకంటూ ఒక ముద్ర వేసుక్జున్న దర్శకుడు నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన చేస్తున్న సినిమాలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ శ్రావ్య వర్మ ఎవరో కాదండోయ్ వివాదాల వీరుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. ఈ విషయన్ని స్వయంగా వర్మనే ప్రకటించాడు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ టైంలో. అయితే తాజాగా ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నారని ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. ఇంతకుముందు శివప్రకాశ్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా ఇప్పుడు దిల్ రాజు ఆ పని చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తను వెడ్స్ మను ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అంతే కాదు జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పనులు చూస్తున్నారు. వికారాబాద్, పూణేల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను త్వరలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని ప్రకటన ఇచ్చారు.