అఖిల్ మరోటి మొదలుపెట్టాడు.. ఈ సారైనా హిట్ కొడతాడా లేదా..?

అఖిల్ తొలి సినిమా విడుదల కాకముందు కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడని అంచనా వేసారు. అఖిల్ సినిమాకు వచ్చిన క్రేజ్.. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి ఈయన మాస్ హీరో అవుతాడని కలలు కన్నారు అభిమానులు. అక్కినేని కుటుంబం నుంచి తొలిసారి ఓ మాస్ హీరో వస్తున్నాడని పండగ చేసుకున్నారు. కానీ వాళ్ల ఆనందం అంతా మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో అఖిల్ కెరీర్ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో తనయుడి కెరీర్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు నాగార్జునకు. ఇప్పటికే మన్మధుడు 2 సినిమాతో పాటు బంగార్రాజుకు కూడా కమిట్ అయిన నాగార్జున వాటిని పక్కనపెట్టి మరీ తన తనయుడు పని మీద ఉన్నాడు. నాలుగో సినిమా కోసం చాలా కథలు విన్న ఈ హీరో.. చివరికి బొమ్మరిల్లు భాస్కర్ చేతుల్లో పెట్టాడు. ఈయనకు హిట్స్ లేక చాలా కాలమైంది. పదేళ్ల కింద వచ్చిన పరుగు తర్వాత ఇప్పటి వరకు భాస్కర్ విజయం అందుకోలేదు. కానీ కథ నచ్చి ఈయనతో ముందడుగు వేస్తున్నాడు అఖిల్. పైగా గీతాఆర్ట్స్ నిర్మాణంలో సినిమా తెరకెక్కుతుండటంతో ధైర్యంగా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. తొలిరోజు సెట్లోకి అడుగుపెట్టాడు అఖిల్ అక్కినేని. భాస్కర్ కూడా ఈ చిత్రంతో కచ్చితంగా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మొత్తానికి చూడాలిక.. ఈ ఫ్లాప్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలాంటి మాయ చేస్తుందో..? వచ్చే ఏడాది మొదట్లో అఖిల్ సినిమా విడుదల కానుంది.