పవన్ సినిమాల్లోకి రావాలి.. లేదంటే ధర్నా చేస్తామంటున్న ఫ్యాన్స్..

తానా మహాసభల తర్వాత పవన్ సినిమాలు చేయాలని మరింత ఒత్తిడి పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది. రాజకీయాల కోసం విపరీతంగా గడ్డం పెంచిన పవన్.. ఇప్పుడు మళ్లీ హీరోలా మారిపోయాడు. మొన్న కొత్త లుక్ లో తానా మహాసభలలో కనిపించాడు. అప్పట్నుంచి ఈయన మళ్లీ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నిర్మాతలు అయితే ఈయన కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు పవన్ స్నేహితుడు రామ్ తాళ్ళూరి, ఏ.ఎమ్. రత్నం లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు పవన్ అనుమతి కోసం చూస్తున్నారు. 2024 ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉందని.. ఆ లోపు కనీసం రెండు సినిమాలు అయినా చేయాలంటూ కోరుకుంటున్నారు.
ఒక్కసారి ఓకే అంటే పారితోషికం ఎంత కావాలంటే అంత ఇస్తామని పవన్ కు సందేశాలు పంపుతున్నారు నిర్మాతలు. కానీ పవన్ మాత్రం తనకు ప్రస్తుతం సినిమాలపై ఆసక్తి లేదని కొంతకాలం తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటానని చెబుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే తమ్ముడు దగ్గర వర్కవుట్ కాకపోతే అన్నయ్యను అయినా పట్టుకుందామని అదే నిర్మాతలు చిరంజీవి డేట్స్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం నాగబాబుతో రాయబారాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఇండస్ట్రీలో. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చే పుట్టినరోజు నాటికి అంటే సెప్టెంబర్ 2 నాటికి సినిమాల్లోకి రావాలని మనసు మార్చుకోకపోతే ఆయన ఇంటి ముందే వెరైటీ ఉద్యమం చేస్తామని చెబుతున్నారు అభిమానులు. మొత్తానికి ఈ ఒత్తిళ్ల నుంచి పవన్ ఎలా బయటపడతాడో చూడాలి.