వెబ్ బాట పట్టిన భూమిక !

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోల సరసన మెరిసిన భూమికా చావ్లా, పెళ్లి అయినా పూర్తిగా సినిమాలు మానేయకుండా ఒకటీ అరా చేస్తూనే ఉంది. తన వయసుకు తగ్గట్టు అక్క పాత్రలు, వదిన పాత్రలు చేస్తూ తాను ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆ మధ్య సమంత ప్రధాన పాత్రలోనటించిన యూ టర్న్ లో దెయ్యం పాత్ర చేసిన ఆమె ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకున్నా ఆమె తమిళ్ సినిమాలతో మాత్రం బిజీగానే ఉందట. ప్రస్తుతం రెండు తమిళ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే ఆమె గురించి ఒక ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించనుందట. భమ్ర అనే ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు అగ్రిమెంట్ చేసుకుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా అంతే కీలకమైన పాత్రలో భూమిక నటిస్తోంది. ఈ మధ్యనే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ వెబ్ సిరీస్ సిమ్లా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోందని సమాచారం. దాదాపు షూట్ అంతా అక్కడే జరుగుతుందని అంటున్నారు. సంజయ్ సూరి, ఓంకార్ కపూర్, ఐజాజ్ ఖాన్ తదితరులు ఈ సిరీస్‌లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లకి మంచి డిమాండ్ ఏర్పడింది. వాటికి ఎక్కువ ఆదరణ లభిస్తుండడంతో టాప్ స్టార్స్ కూడా ఈ సిరీస్ చేస్తున్నారు.