English   

పూరీ కోసం బైక్ ఎక్కిన వ‌ర్మ‌.. ఫైన్ వేసిన పోలీసులు..

rgv
2019-07-20 20:52:04

శిష్యుడు పూరి జగన్నాథ్ చాలా రోజుల తర్వాత విజయం అందుకోవడంతో గురువు వ‌ర్మ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఇక తన వంతుగా తన శిష్యుడు తెరకెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకు ప్రమోషన్ మొదలు పెట్టాడు. వర్మ కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా రోడ్డెక్కి ప్రమోషన్ చేస్తున్నాడు. తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాన్ని చూడటానికి హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ కు తన శిష్యులతో కలిసి వచ్చాడు రాంగోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించిన ఆగస్త్య‌.. ఆర్ఎక్స్ 100 అజ‌య్ భూప‌తితో కలిసి ఒకే బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వచ్చాడు వర్మ. అది కూడా హెల్మెట్ పెట్టుకోకుండా రావడంతో పోలీసులు ఆయనకు ఫైన్ వేసారు. 1300 రూపాయలు ఫైన్ కట్టాలంటూ ఛ‌లాన్ విడుదల చేశారు.
మరోవైపు వర్మ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా శ్రీ రాములు థియేటర్ కు వచ్చారు. తన శిష్యుడి సినిమాను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ చూశాడు వర్మ. సాధారణ అభిమానుల మధ్య విజిల్స్ వేస్తూ థియేటర్ లో గోల గోల చేసాడు ఈయ‌న‌. అక్కడితో ఆగకుండా ఊర మాస్ అవతారంలో థియేటర్ కు వచ్చాడు. ట్విట్టర్లో ఇది అప్డేట్ చేస్తూ వచ్చాడు ఆర్జీవి. దాంతో అభిమానులు కూడా వర్మ కోసం భారీగానే వచ్చారు. థియేటర్లో ఆయన గోల చేస్తుంటే అంతకుమించి గోల చేయడానికి అభిమానులు ఆయనతో పోటీ పడ్డారు. పూరి జగన్నాథ్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని.. చాలా రోజుల తర్వాత తాను చూసిన మాస్ సినిమా ఇదే అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. కలెక్షన్ల విషయంలో కూడా ఇస్మార్ట్ శంకర్ ఎక్కడా తగ్గడం లేదు. రెండు రోజుల్లోనే 14 కోట్లుకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. మూడో రోజుకి చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నాలుగో రోజు నుంచి లాభాల పంట పండుతుంది. మొత్తానికి పూరి జగన్నాథ్ ఇన్ని రోజుల తర్వాత హిట్ కొట్ట‌డంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 

More Related Stories