మనషుల కంటే కుక్కలే నయం.. విశ్వాసం చూపిస్తాయంటున్న పూరీ..

ఒకసారి నమ్మకం పోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకోవడం అనేది చిన్న విషయం కాదు. మనిషిని మరో మనిషి నమ్మాలంటే ఉండాల్సింది నమ్మకమే.. అది పోయిన తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా ఎంత చేసినా కూడా గతం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ విషయంలో కూడా ఇదే జరిగింది. మనుషులను నమ్మటం దాదాపు మానేశాడు ఈయన. ఎందుకంటే అంతా బాగుంది అనుకున్న సమయంలో చుట్టూ చేరి భజన చేసిన వాళ్లే ఒక్కసారి కష్టాలు వచ్చిన తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అంటున్నాడు పూరీ. ఆ మధ్య వరస పరాజయాలు.. దానికి తోడు ఫ్యామిలీ సమస్యలు.. అన్నింటికీ మించి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం పూరి జగన్నాథ్ కెరీర్ ను పాతాళానికి పడేశాయి. ఆ సమయంలో తనకు ఎవరెవరు ఉన్నారు అని ఒక్కసారి ప్రశ్నిస్తే ఇండస్ట్రీతో పాటు స్నేహితులు కూడా వదిలేశారని ఆవేదనగా చెబుతున్నాడు పూరి జగన్నాథ్. ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టాడు ఈ దర్శకుడు. విజయం లేకపోతే ఇండస్ట్రీలో ఎవరు ఎవరిని పట్టించుకోరని.. తాను కూడా అందుకు మినహాయింపు కాదు అంటున్నాడు. గతంలో ఎవరు ఎవరికి ఎన్ని విజయాలు ఇచ్చినా.. నిర్మాతలకు డబ్బులు తీసుకొచ్చినా కూడా ప్రస్తుతం మనం ఏంటి అనేది మాత్రమే ఇక్కడ చూస్తారని ఆ కృతజ్ఞత అనేది ఉండదు అంటున్నాడు పూరి జగన్నాథ్.
మనుషులను నమ్మటం కంటే కుక్కలను నమ్మడం నయం అంటున్నాడు. అందుకే మనుషులను ప్రేమించడం ఎప్పుడో మానేసానని.. కేవలం ద్వేషించడం మాత్రమే చేస్తున్నాను అంటున్నాడు ఈయన. పడిన ప్రతిసారీ లేవడం తనకు అలవాటుగా మారిందని కానీ కొందరు కొన్నిసార్లు కావాలనే పడేసేందుకు ప్రయత్నించారు.. అలాంటి వాళ్ళని ఎప్పటికి మరిచిపోను అంటున్నాడు పూరీ. కేవలం మనతో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి మన చుట్టూ చేసేవాళ్లను ఎప్పటికీ నమ్మకూడదని తన జీవితం తనకు నేర్పించింది అంటున్నాడు ఈ సంచలన దర్శకుడు. మీడియాను కూడా ఇంతకుముందు చాలా గౌరవించే వాడినని.. జర్నలిస్టులతో రెగ్యులర్ గా మాట్లాడేవాడినని.. డ్రగ్స్ కేస్ తర్వాత వాళ్లను కూడా బ్లాక్ లో పెట్టేశాను అంటున్నాడు. ఒక నెలరోజుల పాటు తన టీవీ చానల్స్ లో పూరీ జగన్నాథ్ అనే వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు అంటున్నాడు ఈయన. ఆ రోజు గడిస్తే చాలు.. వాడి ఫ్యామిలీ ఎలా పోయినా పర్లేదు అనుకునే వాళ్లే ఇక్కడ ఉన్నారంటున్నాడు పూరీ. ఆ మాట తీరు చూసిన తర్వాత ఎంతగా ఆయన్ని అంతా కలిసి గాయపరిచారో అర్థం అయిపోతుంది.