బిగ్ బాస్ లో కాపీ రైట్ ఇష్యూ.. తెలివిగా వ్యవహరించిన నాగార్జున..

ఇప్పుడు ఎక్కడ ఎవర్ని కదిపినా కూడా బిగ్ బాస్ గురించే చర్చ నడుస్తుంది. కింగ్ నాగార్జున హోస్టుగా మొదలైన ఈ షోపై ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3లో అందరికంటే ముందు ఇంట్లోకి వచ్చిన బ్యూటీ శివ జ్యోతి. అసలు ఈ పేరు ఎవరికీ తెలియదు. అందరికీ తీన్మార్ సావిత్రిగానే పరిచయం. బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా అంతా ఇదే పేరుతో పిలుస్తారని అనుకున్నారు. కానీ ఆమె స్టేజిపైకి వచ్చినప్పటి నుంచి ఇంట్లోకి వెళ్లేవరకు కూడా ఎక్కడా తీన్మార్ అనే పేరు వినిపించలేదు. అయితే ముందు నుంచి కూడా వి6లో తమ షో యాంకర్స్ కు బయట కూడా పని చేసుకునే అవకాశం కల్పించారు. ఫ్రీ లాన్స్ చేసుకోవచ్చనే నిబంధనతోనే బిత్తిరి సత్తి కొన్ని సినిమాలు కూడా చేసాడు. అతడితో పాటే సావిత్రి కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఇష్యూను మాత్రం శివ జ్యోతి సీరియస్ గా తీసుకుంది. గతంలో ఎక్కడికి వెళ్లిని కూడా వి6 బ్రాండ్ వాడుకుంది ఈమె. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదు.
ఇప్పుడు బిగ్ బాస్ ఇంటికి వెళ్లడానికి ఆమె వి6 బాస్ అనుమతి కోరడం గురించి పట్టించుకోకుండా ఏకంగా జాబ్ మానేసింది. అయితే కాపీరైట్ చట్రంలో తీన్మార్ కాన్సెప్ట్, క్యారెక్టర్స్ ఉన్నాయన్న సంగతి లీగల్ మార్గంలో బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టికి తెచ్చింది వి6 ఛానెల్. ఇది దృష్టిలో పెట్టుకుని కాపీరైట్ పరిధిలో ఉన్న క్యారెక్టరు పేరు తమ అనుమతి లేకుండా ఉపయోగించరనే నమ్ముతున్నామంటూ సదరు ఛానల్ యాజమాన్యానికి పంపిన సుదీర్ఘ నోటీసు పత్రంలో విశ్వాసం వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాపీరైట్ చట్టాల పరిధి, పరిమితి తెలిసిన బిగ్ బాస్ నిర్వాహకులు వి6 సంస్థ పేరిట సర్వ హక్కులు ఉన్న తీన్మార్ క్యారెక్టర్స్ లో ఒకటైన సావిత్రి పేరు తీసి న్యాయపరమైన చిక్కులు తెచ్చుకోవడం ఎందుకని భావించినట్టున్నారు. అందుకే మొదట్నుంచి కూడా ఎక్కడా నాగార్జున కూడా శివ జ్యోతి అనే పేరు తప్ప తీన్మార్ ఊసు ఎత్తలేదు.