దర్బార్ సెట్ లో రజినీకాంత్.. పోలీస్ డ్రస్ లో సూపర్ స్టార్ కేక..

సర్కార్ తర్వాత మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమా దర్బార్. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈయన రాజకీయాల్లో బిజీ అవుతాడో లేదో తెలియదు కానీ సినిమాల్లో మాత్రం చాలా బిజీ అవుతున్నాడు. 70 ఏళ్ళ వయసులో ఈ జోరు చూసి కుర్ర హీరోలు కూడా కుళ్లుకుంటున్నారు. రెండేళ్ల కింది వరకు మూడేళ్లకో సినిమా చేయడానికి కూడా ఇబ్బంది పడ్డ రజనీకాంత్ ఇప్పుడు మాత్రం ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇలా జోరు పెంచడం వెనక కారణాలు ఎవరికీ అర్థం కావడం లేదు. వరసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాడు సూపర్ స్టార్. అయినా కూడా ఆయన ఇమేజ్ తో వరసగా దర్శకులు కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మురగదాస్ సినిమాతో బిజీ అయిపోయాడు రజనీకాంత్. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు రజినీ. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ నటిస్తున్నారు. తాజాగా ఈయన ఫోటో ఒకటి బయటికి వచ్చింది. సెట్లో పోలీస్ డ్రస్ లో ఉన్న రజినీ ఫోటో చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ ఖాకి డ్రెస్ వేసుకొని మూడు దశాబ్దాలు దాటిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు సూపర్ స్టార్. దానికి తోడు మురుగుదాస్ సినిమా అంటే కచ్చితంగా సందేశం ఉంటుందని గ్యారెంటీ ఉంది. సర్కార్ లాంటి సినిమా తర్వాత మురుగుదాస్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. పేట సినిమా కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోవడంతో ఇప్పుడు మురుగుదాస్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు సూపర్ స్టార్. మరి ఈయన ఆశలను మురుగుదాస్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.