డియర్ కామ్రేడ్ రన్ టైమ్ తెలుసా.. విజయ్ దేవరకొండ మరో సాహసం..

ఇప్పుడు తెలుగులో డియర్ కామ్రేడ్ ఫీవర్ నడుస్తుంది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాడు విజయ్ దేవరకొండ. పైగా ఈయన ట్రాక్ రికార్డ్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. అన్నింటికీ మించి విడుదలకు ముందే సినిమా చూసి హిందీలో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ రైట్స్ తీసుకోవడం సంచలనమే. ఇక మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కానుంది. యు బై ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ అయిన ఈ చిత్రం రన్ టైమ్ భారీగానే ఉండబోతుంది. 2 గంటల 49 నిమిషాలతో డియర్ కామ్రేడ్ వస్తున్నాడు. సాధారణంగా అయితే ఇది భారీ నిడివే.. కానీ విజయ్ గత సినిమాలు కూడా ఇదే స్థాయిలో వచ్చాయి. అర్జున్ రెడ్డి మూడు గంటలతో వచ్చి విజయం సాధించింది. అదే నమ్మకంతో ఇప్పుడు డియర్ కామ్రేడ్ కూడా వస్తుంది.
గీతగోవిందం, టాక్సీవాలా సినిమాల సంచలన విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో డియర్ కామ్రేడ్ పై అంచనాలు దారుణంగా పెరిగిపోయాయి. బిజినెస్ కూడా అలాగే జరుగుతుందిప్పుడు. కాలేజీ గొడవల నేపథ్యంలో కొత్త దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జులై 26న నాలుగు భాషల్లో దాదాపు 1500 స్క్రీన్స్ లో విడుదల కానుంది ఈ చిత్రం. ట్రైలర్ లో కథ మొత్తం చెప్పేసాడు దర్శకుడు. శివ సినిమా రేంజ్ లో గొడవలను హైలైట్ చేస్తూనే.. మరోవైపు ప్రేమకథ కూడా చూపించాడు భరత్ కమ్మ. ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్, ముద్దులు అన్నీ ఉన్నాయి. అర్జున్ రెడ్డిలో అధర చుంబనాలు విషయంలో ఆరితేరిపోయిన విజయ్ దేవరకొండ గీతగోవిందంలో కూడా ఒకసారి కిస్ చేసాడు. ఇక ఇప్పుడు కూడా రష్మిక మందన్నతో అదే పనిలో ఉన్నాడు ఈయన. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ సారి కూడా విజయ్ బాగా గట్టిగా బాక్సాఫీస్ దగ్గర కొట్టేలా కనిపిస్తున్నాడు. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి భరత్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెరకెక్కించాడు.