కన్నడ కురుక్షేత్రం...ట్రైలర్ టాక్

కన్నడంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన మహాభారత దృశ్య కావ్యం అయిన కురుక్షేత్రం సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. వృషభాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మునిరత్న నిర్మిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సమర్పిస్తున్నారు. ఆయన కూడా ఈ సినిమాలో శలుడి పాత్రలో నటించడం గమనార్హం. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నిన్న సాయంత్రం విడుదల చేశారు. ‘ఈ విశాలమైన కురు మహాసామ్రాజ్యానికి ధర్మరాజును యువరాజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తున్నాను’ అని భీష్ముడిగా నటించిన దివంగత నటుడు అంబరీష్ చెబుతున్న డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. కానీ మీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని దుర్యోధనుడిగా నటించిన కన్నడ స్టార్ హీరో దర్శన్ ని పరిచయం చేశారు. కర్ణుడిగా అర్జున్ సర్జా, అభిమన్యుడిగా నిఖిల్, శకునిగా రవికుమార్, ద్రౌపదిగా స్నేహా, అర్జునుడిగా సోనూసూద్, కృష్ణుడిగా రవిచంద్రన్ లను ఈ ట్రైలర్ లో పరిచయం చేశారు. అధర్మాన్ని అధర్మంతోనే జయిస్తానని అర్జునుడిగా నటించిన సోనూ సూద్ చెప్పడం హైలైట్ గా నిలుస్తుంది. అయితే కృష్ణుడిగా ఎన్టీఆర్ లాంటి వారిని చూసిన మనకు రవి చంద్రన్ అంతగా సూట్ అయినట్టు అనిపించరు. మొత్తానికి ఎన్ని సార్లు చూసినా, చెప్పుకున్నా బోర్ కొట్టని సబ్జెక్ట్ కావడంతో సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. కేజీఎఫ్ నుండి మొదలయిన అనువాదాలు ఈ సినిమాకి మరింత ప్లస్ కావచ్చని భావిస్తున్నారు మేకర్స్, చూడాలి మరి.