English   

జార్జ్ రెడ్డి ఫస్ట్ లుక్...చరిత్ర మర్చిపోయిన లీడర్

biopic
2019-08-01 20:25:23

జార్జి రెడ్డి అంటే ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ మన తండ్రుల తరం వారికి ఆయన సుపరిచితుడే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయనో విద్యార్ధి కాదు కాదు అంతకు మించిన ఉద్యమ నేత, ఎంతో మంది విద్యార్ధి నేతలకు ఆయన జీవితం ఆదర్శం. అతి చిన్న వయసులోనే కాలేజీలోనే తన విరోధుల చేతిలో హతమయిన ఆయన మీద బయోపిక్ సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఆయన ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో చదువు కోసం వచ్చే నాటికి అది మ‌తోన్మాదుల, కులోన్మాదుల అర‌చ‌కాల‌కు అడ్డాగా ఉండేది. ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకునేవారు. అలాంటి సమయంలో ఈ రాజ‌కీయాల‌కు జార్జిరెడ్డి అడ్డుక‌ట్ట వేశాడు. ఏబీవీపీ నాయ‌కుల తీరును స‌వాల్ చేస్తూ విద్యార్థుల‌ను సంఘటితం చేశాడు. ఈవ్ టీజింగ్‌, ర్యాగింగ్‌కి పాల్ప‌డే వారికి త‌గిన బుద్ధి చెప్పాడు. ఆయన జీవిత కదా ఆధారంగా గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఈ సినిమా యూనిట్. ఈ లుక్ లో  వంగవీటి ఫేం సందీప్ మాధవ్ (సాండీ) ఈ సినిమాలో జార్జ్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి అలాగే హీరో సత్య దేవ్ కూడా ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక జార్జి రెడ్డి తల్లి పాత్ర పోషిస్తున్నారు. 1970ల బాక్ డ్రాప్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాని మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి త్రీ లైన్స్ సినిమా బ్యానర్‌ తో కలిసి సిల్లీ మాంక్స్ స్టూడియోస్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరాఠీ సైరత్ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించి ఇటీవల నాన్ సినిమాతో దర్శకుడిగా కూడా మారిన సుధాకర్ రెడ్డి ఈ చిత్రానికి కెమరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక నీదినాదీ ఒకే కధ ఫేం సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

 

More Related Stories