వామ్మో ఒక్క సినిమాకి అన్ని గెటప్సా ?

దక్షిణాదిన ఉన్న టాలెంటెడ్ యాక్టర్ లలో చియాన్ విక్రమ్ ఒకరు. ఉత్తరాదిన అమీర్ ఖాన్ ఎలా సినిమా సినిమాకి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటిస్తారో దక్షిణాదిన విక్రమ్ కూడా అంతే. అలా ఆయన ఒక సినిమాలో రకరకాల పాత్రలు చేసిన సినిమాలు అపరిచితుడు, మల్లన్న, ఐ, ఇంకొక్కడు వంటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన నటించబోయే తాజా సినిమాలో ఏకంగా 25 గెటప్స్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఒక సినిమా ఒకే అయ్యింది. తమిళ టెలివిజన్ సెన్సేషన్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్స్ లో నటించనున్నారని అంటున్నారు, ఆయన్ని అన్ని గెటప్స్ లో తీర్చిదిద్దెందుకు ఒక అమెరికన్ మేకప్ కంపెనీ వర్క్ చేస్తోందట. ఈ సినిమా ప్రకటించినప్పుడు విడుదల చేసిన పోస్టర్లో కూడా విక్రమ్ పలు గెటప్స్‌లో ఉన్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, వయాకామ్ 18స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని ఏకకాలంలో తమిళ, తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పాతిక గెటప్స్ అనేది నిజమే అయితే ప్రపంచ రికార్డ్ మన విక్రమ్ పేరిట ఉంటుంది.