హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం !

దేశం మొత్తం మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మృతితో విషాదంతో మునిగి ఉంటే, బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. హృతిక్ తాత, లెజెండరీ ఫిల్మ్ మేకర్ జే ఓం ప్రకాష్ ఈ ఉదయం కన్నుమూశారు. 93 సంవత్సరాల ఓం ప్రకాష్ మరణించినట్టు నటుడు దీపక్ పరాషర్ తన ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ ఉదయం తొమ్మిది గంటల సమయంలో ట్వీట్ చేసిన ఆయన తమ అంకుల్ ప్రకాష్ గంట క్రితం కన్నుమూశారని, ఆయన స్వర్గంలో తన స్నేహితుడు మోహన్ కుమార్ ని కలుసుకోనున్నారని ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాకి వారు చేసిన సేవ మనకి వారిచ్చిన గిఫ్ట్ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు దిగిన పిక్ ని ఆయన షేర్ చేశారు. జె ఓం ప్రకాష్ దర్శకడే కాక నిర్మాతగా కూడా చాలా సినిమాలు చేశారు. 1927 జనవరి 24 న పాకిస్తాన్లోని పంజాబ్ లోని రావల్పిండిలో జన్మించారు. ఆయన అసలు పేరు జయ ఓం ప్రకాష్. ఆయన బాలీవుడ్లో ఆయే దిన్ బహర్ కే, ఆంఖోన్ ఆంఖోన్ మెయిన్, ఆషా మరియు అఫ్సానా దిల్వాలన్ కా వంటి ప్రముఖ చిత్రాలను నిర్మించారు. చిత్ర నిర్మాణంతో పాటు అనేక చిత్రాలకు కూడా దర్శకత్వం వహించాడు. ఆయన 1974 లో ఆప్ కి కసం చిత్రంతో డైరెక్టర్ గా మారారు. ఆయన తీసిన సినిమా టైటిల్స్ అన్నీ ‘ఎ’ తోనే ఉండేవి, ఒక్క భగవాన్ దాదా సినిమా తప్ప. ఈ సినిమాతోనే ఆయన మనవడు హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2001లో విడుదలైన అఫ్సానా దిల్వాలో కా సినిమా నిర్మాతగా ఆయన చివరి సినిమా. ఓం ప్రకాష్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.