తమిళనాట ఓ బేబీ విడుదల.. సమంత మ్యాజిక్ పని చేస్తుందా..?

సమంతకు తెలుగులోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి ఇమేజ్ ఉంది. అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది ఈమె. పెళ్లి తర్వాత ఎందుకో కానీ అక్కడ ఫోకస్ చేయడం లేదు సమంత. కానీ ఈమె నటించిన సినిమాలు మాత్రం అక్కడ అనువాదం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఓ బేబీ కూడా ఇలాగే అక్కడ విడుదల కానుంది. ఆగస్ట్ 15న పంద్రాగస్ట్ కానుకగా సమంత ఓ బేబీ సినిమాను తమిళ్లో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాపై అక్కడ కూడా ఆసక్తి బాగానే కనిపిస్తుంది. దానికి కారణం సినిమా కాన్సెప్ట్. రాత్రికి రాత్రే 70 ఏళ్ల బామ్మ పాతికేళ్ళ భామగా మారిపోవడం అనేది నిజంగానే కొత్తగా ఉంటుంది. నందిని రెడ్డి తెరకెక్కించినీ చిత్రం కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్. తెలుగులో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళనాట అదే పేరుతో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అక్కడ కూడా సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని నమ్ముతుంది సమంత. దానికి కారణం సినిమాపై ఉన్ననమ్మకం.. ఆ కథపై ఉన్న నమ్మకం. గతేడాది ఈమె నటించిన యూ టర్న్ సినిమా రెండు భాషల్లోనూ ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడు ఓ బేబీ విషయంలో అలా కాదంటుంది స్యామ్. ఇదిలా ఉంటే తమిళనాట ఈ మద్యే విడుదలైన పేరళగి ఐఎస్ఓ కూడా ఇలాంటి కథతోనే వచ్చింది. సీనియర్ నటి సచ్చు, శిల్ప మంజునాథ్లు ఇందులో నటించారు.