వరద బాధితులకు జెనీలియా సాయం.. భర్త రితేష్ తో కలిసి..

జెనీలియా.. బొమ్మరిల్లు సినిమాలో హాహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన బ్యూటీ. ఆ సినిమాలో అమ్మడుకు ఎంత మంచి మనసు ఉందో బయట కూడా అంతే మంచి మనసు చూపిస్తుంది. తాజాగా మహారాష్ట్రను వరదలు ముంచేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అక్కడ ఎవరికీ కంటి నిండా కునుకు లేదు.. మనశ్శాంతి లేదు.. ఎప్పుడు ఏ వరద వచ్చి తమ బతుకులు తెల్లారిపోతాయో అని భయపడుతూ బిక్కుబిక్కుమంటున్నారు జనం. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ వరద బాధితుల కోసం ఇప్పుడు తనవంతు సాయం చేసింది జెనీలియా. భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు విరాళం అందించింది ఈ మాజీ హీరోయిన్. దీన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అందించింది. అప్పట్లో జెనీలియా మామ.. రితేష్ దేశ్‌ముఖ్ తండ్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసారు. అప్పట్నుంచి కూడా ప్రజల కోసం పని చేయడం అలవాటుగా మార్చుకుంది జెన్నీ. ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తుంది. మొత్తానికి తమ డబ్బులో కాస్తైనా ఇలా జనాల కోసం ఖర్చు చేయడం నిజంగానే గొప్ప విషయం.