పాక్ లో ప్రదర్శన....ఇండియన్ సింగర్ మీద నిషేధం !

కశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్ధు కారణంగా పాక్ ప్రభుత్వం మన సినిమాలని పాక్ లో ఆడకుండా నిషేదించింది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ పాక్ నటీనటులని భారత్ సినిమాలలో నటించకుండా చూడాలని ప్రధానిని కోరిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం భారత సినిమాలని నిషేదించిన క్రమంలో మనం కూడా పాక్‌కి సంబంధించిన ఆర్టిస్టులు, సంగీత కళాకారులు, దౌత్యవేత్తల మీద భారత్ రాకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాసింది. వారిని నిషేదించే వరకు మొత్తం చిత్ర పరిశ్రమ, సినీ కార్మికులు తిరిగి పనులు మొదలుపెట్టరని లేఖలో పేర్కొంది. నిజానికి 2016లో ఉరి దాడి జరిగినప్పుడే పాక్ నటీనటులపై నిషేధం విధించారు.
ఆ సమయంలో పాకిస్థానీ నటీనటులు యాక్ట్ చేసిన సినిమాల విడుదల కానీయకుండా అడ్డంకులు సృష్టించారు. అయితే ఇన్ని చేస్తుంటే మనదేశానికి చెందిన ఒక గాయకుడు మాత్రం పాకిస్తాన్ వెళ్లి అక్కడ ప్రదర్శన నిర్వహించాడు. ఈ క్రమంలో ఆ గాయకుడు మీకాసింగ్ మీద నిషేధం విధిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరాచీ నగరంలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముష్రాఫ్ సమీప బంధువు ఒకరు మీకాసింగ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన మీద నిషేధం విధించారు. గాయకుడు మీకాసింగ్ మీద నిషేధం విధించిన క్రమంలో ఆ గాయకుడుని అన్ని నిర్మాణ సంస్థలు, మ్యూజిక్ కంపెనీలు బహిష్కరించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కోరింది. అతనితో కలిసి భారతదేశంలో ఎవరూ పనిచేయరాదని, అలా పనిచేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ హెచ్చరించింది.