English   

ఎవరు రివ్యూ

 Evaru Review
2019-08-15 10:44:58

క్షణం, గూఢచారి లాంటి సినిమాల తర్వాత నిజంగానే అడవి శేష్ సినిమాలపై ఆసక్తి పెరిగిపోయింది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ హీరో. ఇప్పుడు కూడా ఎవరు అంటూ మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది..?

కథ: 

సమీర (రెజీనా) ఓ టాప్ బిజినెస్ మ్యాన్ భార్య. అనుకోకుండా అశోక్ కృష్ణ (నవీన్ చంద్ర) మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. అసలు అది ఎలా జరిగింది అని తెలుసుకునేలోపే పోలీసులు సీన్ లోకి వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు అన్నీ మారిపోతాయి. ఆ సమయంలో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ విక్రమ్ వాసుదేవ్ (అడవి శేష్) రంగంలోకి దిగుతాడు. అతడి విచారణ అనేక మలుపులకు దారి తీస్తుంది. ఆయన వేసే ప్రతీ ప్రశ్నకు సమీరా చెప్పే సమాధానాలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంటాయి. అసలు సమీర ఎందుకు అశోక్‌ను చంపింది.. ఏం జరిగింది అనేది అసలు కథ.. 

కథనం:

ఒక ప్రశ్న వేసినపుడు సమాధానం తెలిసేవరకు నిద్ర పట్టదు.. అలాంటి ప్రశ్నలనే తన సినిమా కథలుగా ఎంచుకుంటున్నాడు అడవి శేష్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలున్నారు. అందుకే తనకంటూ ప్రత్యేకంగా ఓ దారి వెతుక్కుంటున్నాడు అడవి శేష్. క్షణం.. గూఢచారి.. ఇప్పుడు ఎవరు.. ప్రతీ సినిమాలోనూ ఉన్నది సస్పెన్సే. మొదట్లోనే ఓ ప్రశ్న సంధించడం.. ఆ తర్వాత సమాధానం కోసం ప్రయత్నం.. ప్రయాణం.. ఎవరు కూడా పూర్తిగా స్క్రీన్ ప్లే నేపథ్యంలో సాగే సినిమా. రేప్ అండ్ మర్డర్ మిస్టరీగా మొదలై.. ఊహించని మలుపులతో సాగుతుంది కథ. సమాధానం సగంలోనే తెలిసిపోయినా.. కథ ఇదే అయ్యుంటుందని అర్థమైనా.. ప్రశ్నలు మాత్రం ఆసక్తికరంగానే అనిపించాయి.. స్క్రీన్ ప్లే మాయ బాగానే పని చేసింది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కథనం ఆసక్తికరంగా సాగింది. సినిమా అంతా ఒకే గదిలో కూర్చుని నడుస్తుందంటే నమ్మడం కూడా కష్టమే. అక్కడక్కడా కాస్త పట్టు విడుస్తున్నట్లు అనిపించినా కూడా ఆసక్తి మాత్రం తగ్గలేదు. శేష్ వేసే ప్రశ్నలు.. రెజీనా చెప్పే సమాధానాలు.. అందులోంచి తలెత్తే అనుమానాలు.. మళ్లీ అక్కడ్నుంచి మరో ప్రశ్న.. సమాధానం.. ఇలా రేసీగా వెళ్లిపోయింది కథనం. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదించింది.. క్లైమాక్స్ బాగుంది.  అడవి శేష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.. రెజీనా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది..నవీన్ చంద్ర బాగానే చేసాడు.. మురళీ శర్మ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బద్లా సినిమాకు రీమేక్.. ఇది కూడా ఇన్విజిబుల్ గెస్ట్ అనే సినిమాకు రీమేక్. అక్కడ్నుంచి స్క్రీన్ ప్లే తీసుకున్నారు. ఓవరాల్‌గా ఎవరు ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్..

నటీనటులు:

అడవి శేష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తూనే మరోవైపు మరో భిన్నమైన కోణం కూడా చూపించాడు ఈయన. ఇక రెజీనా మరోసారి ఛాలెంజింగ్ పాత్రలో నటించింది. నెగిటివ్ ఛాయలున్న పాత్రలో బాగానే మెప్పించింది ఈమె. నవీన్ చంద్ర కూడా మంచి పాత్రలో కనిపించాడు. ఉన్నంత సేపు బాగానే నటించాడు. మురళీ శర్మ కూడా కనిపించేది కాసేపే అయినా కూడా అద్భుతమైన నటనతో కథను నడిపించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.. 

టెక్నికల్ టీం:

శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమాకు ప్రాణం. పాటలు ఒక్కటి రెండే ఉన్నా కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపించింది. ఎక్కడా అనవసరపు సన్నివేశాలు కనిపించలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అబ్బూరి రవి డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడిగా వెంకట్ రాంజీ మాయ చేసాడు. తొలి సినిమా అయినా కూడా ఆయన టాలెంట్ కనిపించింది. రీమేక్ ఫ్రీమేక్ అనేది పక్కనబెడితే నచ్చేలా తెరకెక్కించాడు ఈ దర్శకుడు. 

చివరగా:

ఎవరు.. ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 

రేటింగ్ : 2.75 / 5

More Related Stories