వామ్మో వరుణ్ తేజ్ ఇలా ఉన్నాడేంటి..?

వరుణ్ తేజ్ అంటే ఇప్పటి వరకు అందంగా.. గ్లామర్ గా కనిపించాడు. ఎఫ్ 2 లాంటి సినిమాల్లో అయితే అమ్మాయిలు ఈయన్ని చూసి ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం వాల్మీకి టీజర్ చూసిన తర్వాత వరుణ్ తేజ్ ను చూసి భయపడతారంతా. అంతగా ఈ చిత్రం కోసం మారిపోయాడు మెగా వారసుడు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ముందు నుంచి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. పైగా తమిళనాట భారీ విజయం సాధించిన జిగర్తాండ సినిమా రీమేక్ కావడంతో ఆసక్తి పెరిగిపోతుంది. ఇందులో నెగిటివ్ కారెక్టర్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. అక్కడ బాబీ సింహా చేసిన పాత్ర ఇది. ఇక సిద్ధార్థ్ పాత్రలో తమిళ హీరో అథర్వ మురళి నటిస్తున్నాడు. డిజే తర్వాత మరోసారి హరీష్ శంకర్ తన సినిమాలో పూజా హెగ్డేకు ఆఫర్ ఇచ్చాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. టీజర్లో వరుణ్ తేజ్ ను చూసి అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ చిత్రంతో మరో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు మెగా హీరో. హరీష్ శంకర్ కూడా ఈ చిత్రాన్ని మంచి కసితో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. టీజర్ లో అడుగడుగునా ఆ కసి కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతో వరుణ్ తేజ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.