అలనాటి ప్రముఖ సినీ దర్శకుడు మృతి

అలనాటి ప్రముఖ సినీ దర్శకుడు యెర్నేని రంగారావు మృతిచెందారు. ఈయన ఆదివారమే మృతి చెందినా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాహిని స్టూడియోలో పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ప్రముఖ దర్శకుడు కెవి రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తరువాత ఆయన సవతి కొడుకు, మాయావి, అర్చన అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. కృష్ణా జిల్లా గురజకి చెందిన రంగారావు చాలా చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మద్రాస్‌లోని వాహినీ స్టూడియోస్‌లో జయరామ రెడ్డితో కలిసి పెయింటర్‌గా, మౌల్డర్‌గా చేరిన ఆయన డైరెక్షన్ మీద ఆసక్తితో ప్రముఖ దర్శకులు హెచ్.ఎమ్. రెడ్డి, కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు.
రెండేళ్ల తర్వాత జయరామ రెడ్డితో కలిసి బాపు ఫిలింస్ ఆరంభించి, 1960లో ‘టౌన్ బస్’ అనే సినిమాని తెలుగులోకి అనువదించి, విడుదల చేశారు. అయితే సొంతగా సినిమా తీయాలనే కోరికతో 1963లో ఎన్టీఆర్, షావుకారు జానకి, గుమ్మడి కలయికలో ‘సవతి కొడుకు’ అనే సినిమా తీశారు. ఆ తర్వాత నూతన నటీనటులతో మాయావి, అర్చన అనే సినిమాలు కూడా తీశారు. 1954లో తన మేనకోడలు ఉప్పలపాటి రఘుమా దేవిని పెళ్లాడిన ఆయన 1990లో యూఎస్‌లో డాక్టర్‌గా సెటిలైన తనయుడి దగ్గరకు వెళ్లిపోయారు. అలా అక్కడ యూఎస్ పౌరసత్వం పొందిన రంగారావు 2002లో మళ్ళీ ఇండియా వచ్చేశారు. అప్పటి నుండీ గురజలోనే ఉంటున్నారు. కుమారులు అమెరికా నుండి రానుండంతో ఈరోజు ఆయన అంతిమ క్రియలు గురజలో జరుగనున్నాయి.