English   

అన్నయ్య చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు..

pk
2019-08-21 19:23:14

ఆగస్ట్ 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అది కూడా అధికారికంగా జనసేన పార్టీ తరఫున అన్నయ్యకు పెద్ద లేఖ రాసాడు. ఇది అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆ లేఖలో పవన్ ఇలా రాసాడు.. ’’నాకు స్పూర్థి ప్రదాత చిరంజీవి గారి జన్మదినం.. అభిమానులందరికీ పండగ రోజు. చిరంజీవి గారంటే కేవలం మెగాస్టార్ కాదు.. మూర్తీభవించిన స్పూర్తి. అబ్ధుల్ కలాం గారు చెప్పినట్లుగా కలలు కనడం కాదు.. ఆ కలలను సాకారం చేసుకోడానికి కష్టపడటం అనే జీవన వేదానికి చిరంజీవి గారి ప్రస్థానం నిదర్శనం. కలల సాకారమై.. శిఖరాలను అధిరోహించిన తర్వాత.. నిగర్విగా, నిరాడంబరంగా ఉండటం, తన మూలాలను మరిచిపోని స్పృహతో ఉండటం లాంటి జీవన విలువలకు ప్రతీక చిరంజీవి గారు. తనే ఒక సందోహం.. తన జీవితమొక సందేశం.
ఆ సందేశాన్ని అందిపుచ్చుకన్న లక్షల మంది యువతరంలో నేను కూడా ఓ పరమాణువు కావడం అదృష్టం. అంతకుమించి ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం.
అన్నయ్య చిరంజీవి గారు నరసాపురంలో విద్యార్థిగా ఎన్‌సీసీలో ఉన్ననాటి నుంచి... మద్రాసులో యాక్టింగ్ విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి.. ఇవాళ్టి వరకు అదే ఉక్కు క్రమశిక్షణ. అదే స్థాయిలో అనితర సాధ్యమైన నేర్చుకునే తత్వం. అసామాన్యమైన తన ప్రస్థానంలో ఎన్నెన్ని ఎదురుదెబ్బలు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా.. పట్టుదలతో వాటిని తొక్కేసుకుంటూ.. ఉన్నత శిఖరాలకు ఎగబాకిన ధీరత్వం… చిరంజీవిగారి సొంతం. ఆయన వేసే ప్రతి అడుగు ఆదర్శం, అనుసరణీయం.
ఇవాళ... యావత్ భరతజాతి విస్మరించిన అస్తుత సమరాగ్రేసరుడు.. అగణ్య ధీరాగ్రేసరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని... ఆసేతుహిమనగమూ భళీ భళీయని ప్రతిధ్వనించేలాగా.. ‘సైరా’ అంటూ సినీప్రియులకు కానుకగా అందిస్తున్న చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా తరఫున, జనసైనికుల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి. ఆయన జీవితం.. మరింత మందికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉండాలని కోరుకుంటున్నాను.
ఆకాశం ఎప్పటికీ అలా నిశ్చలంగా, నిర్లిప్తంగా ఉంటుంది. కానీ దాని వలన గాలి అష్టదిక్కులకూ విస్తరిస్తుంది. చిరంజీవిగారు మౌనిగా, మునిగా సుస్థిరంగా ఉంటారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నవతరాలను తీర్చిదిద్దుతూనే ఉంటుంది..’’ అంటూ ముగించాడు పవన్ కల్యాణ్. ఈయన శుభాకాంక్షలు లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More Related Stories