English   

ప్రియాంక చోప్రా మీద కంప్లైంట్ చేసిన పాక్

priya
2019-08-22 06:13:18

కాశ్మీర్ వివాదం నేపధ్యంలో హాలీవుడ్ కి ఏగిన గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రాని టార్గెట్ చేసింది పాకిస్తాన్. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు. తాజాగా ప్రియాంకను గుడ్ విల్ అంబాసిడర్ గా తొలగించాలంటూ యూనిసెఫ్ కు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారి లేఖ రాశారు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ విధానాల్ని ప్రియాంక చోప్రా సమర్ధిస్తున్నారని ఆ లేఖలో తెలిపింది. ఒకరకంగా చెప్పాలంటే కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఇటీవల భారత్‌ పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్‌ జీర్ణించుకోలేకపోతోంది. భారత్‌ దూకుడును కట్టడిచేసేందుకు చైనా సాయంతో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌ కి వెళ్లినా అక్కడ కూడా పాకిస్థాన్‌కు చుక్కెదురయింది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న యూనిసెఫ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరింది పాకిస్థాన్‌.

ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వడమే కాకుండా పాకిస్థాన్పై అణు యుద్ధాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేసిందని ప్రియాంక పై పాక్ ఫిర్యాదు చేసింది. వాస్తవానికి అర్టికల్ 370 రద్దు తర్వాత అమెరికాలో బ్యూటీ కాన్ పేరిట నిర్వహించిన ఒక షోలో ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. పలువురు సెలబ్రెటీలు హాజరైన ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె లైవ్ లో జవాబిచ్చారు. అయితే పాకిస్తాన్‌కు చెందిన అయేషా అనే యువతి కశ్మీర్ పరిణామాలు, సర్జికల్ స్టైక్ విషయంలో ప్రియాంక పై ప్రశ్నలు కురిపించింది. బాలాకోట్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడుల సందర్భంగా ప్రియాంక జైహింద్ అని ట్వీట్ చేయడాన్ని ఆమె తప్పుబడుతూ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న మీరు ఇలాంటి రెచ్చగొట్టే ట్వీట్లు చేయవచ్చా అని ప్రశ్నించింది. అయేషా ఆరోపణలకు ప్రియాంక స్పందిస్తూ భారతీయురాలినని దేశమంటే తనకు గౌరవం, బాధ్యత ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పట్టుకుని ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ సమితిలో ఫిర్యాదు చేసింది పాక్.

 

More Related Stories