English   

గన్ తో కాల్చుకుని చద్దామనుకున్నా...అన్నయ్యే స్ఫూర్తి ప్రదాత 

Pawan kalyan
2019-08-22 09:51:13

నేడు మెగాస్టార్ 64వ పుట్టినరోజు కాగా నిన్ననే మెగా అభిమానులు, మెగా హీరోల సమక్షంలో వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్‌‌లోని శిల్పకళా వేదికలో జే మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మెగా ఫ్యాన్స్ ని ఉత్తేజ పరిచారు, ఆయన చేసిన భావోద్వేగ ప్రసంగం వేడుకల్లో హైలైట్ గా నిలిచింది. ఈ వేడుకల్లో భాగంగా పవన్ మాట్లాడుతూ ఈరోజు తాను పవర్ స్టార్ గా ఇక్కడికి రాలేదని మెగా అభిమానుల్లో ఒకడిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేసి ఇలా వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా పవన్ మరో సారి చిరంజీబి తన స్పూర్తి ప్రదాత అని వక్కాణించారు. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని అన్నయ్యను ఒక అభిమానిగా ఎలాంటి సినిమాలో చూడాలనుకున్నానో అదే సైరా సినిమా అని పేర్కొన్నారు. నరసింహారెడ్డిని చరిత్ర మరచినా కొణిదెల మరువలేదని అన్నారు. 

ఈ సినిమాలో తనకు ఇష్టమైన వ్యక్తులు ఇద్దరున్నారని, ఒకరు అన్నయ్య అయితే రెండవది అమితాబ్ గారని అన్నారు. ఆయన్ని కలిసే అవకాశం ఈ సినిమా షూటింగ్‌లో కలిగిందని పేర్కొన్నారు. ఈమధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్ధులు పదుల్లో చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే తాను కూడా ఇంటర్మీడియట్‌ ఫెయిల్ అయినప్పుడు చాలా నిరాశ చెందానని అన్నయ్య గన్‌ తో కాల్చుకుని చచ్చిపోదామని అనుకున్నానని, కాని అప్పుడు అన్నయ్య చెప్పిన మాట తనలో స్ఫూర్తి నింపిందని పవన్ పేర్కొన్నారు. ముందు నువ్ బతకాలి, నీ బతుకు ఇంటర్‌లో లేదు. నీ దారి వేరే ఉందని అన్నయ్య చెప్పడంతో ధైర్యం కలిగి చావు గురించి ఆలోచించలేదని అన్నారు. అన్న లాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఉంటే ఎవరూ చనిపోరని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. అన్నయ్య అన్న మాటలే ఈరోజు మీ ముందు పవర్ స్టార్ గా నిలబెట్టాయని, అందుకే ఆయన నాకు స్పూర్తిప్రదాత అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్. 

More Related Stories