English   

కౌసల్య కృష్ణమూర్తి రివ్యూ

Kousalya Krishnamurthy Review
2019-08-23 11:11:35

తెలుగమ్మాయి అయినా కెరీర్ మొదటి నుండీ త‌మిళ సినిమాల్లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించిన ఐశ్వ‌ర్యా రాజేష్‌ తెలుగులో తొలిసారిగా చేస్తున్న సినిమా `కౌస‌ల్య కృష్ణ‌మూర్తి`. త‌మిళంలో ఆమె చేసిన `క‌నా` అనే సినిమాని తెలుగులో `కౌస‌ల్య‌ కృష్ణ‌మూర్తి` పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాని తన కెరీర్ లో దాదాపుగా అన్నీ రీమేక్ సినిమాలే చేసిన భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించారు. త‌మిళంలో సూప‌ర్‌హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

క‌థ‌:

తూగోజీల్లాలోని ఇర‌గ‌వ‌రం గ్రామంలో నివ‌సించే కృష్ణ‌మూర్తి(రాజేంద్ర‌ ప్ర‌సాద్‌)కి వ్య‌వ‌సాయం అంటే ప్రాణం. వ్య‌వ‌సాయం అంటే ఎంత ఇష్టమో క్రికెట్ అంటే కూడా కృష్ణ‌మూర్తికి అంతే ఇష్టం. ఎంతగా అంటే అత‌న్ని ఊర్లోని వారంద‌రూ క్రికెట్ పిచ్చోడని గేలి చేసేంతలా, ఇండియన్ టీమ్ క్రికెట్‌ లో ఓడిపోతుంటే, క‌న్నీళ్లు పెట్టుకుంటున్న తండ్రిని చూసిన కౌస‌ల్య‌(ఐశ్వ‌ర్యా రాజేష్‌) చిన్న‌ప్పుడే ఇండియ‌న్ టీమ్ త‌ర‌పున ఆడి గెలిపించి తండ్రిని సంతోష పెట్టాలని అనుకుంటుంది. త‌ల్లికి ఇష్టం లేకున్నా ఆమెకి తెలియకుండా ఊర్లోని మ‌గ‌పిల్ల‌ల‌తో క్రికెట్ ఆడి క్రికెట్ లో మెలుకువలు నేర్చుకుంటూ ఉంటుంది. ఊర్లో అంద‌రూ ఆడపిల్లకి క్రికెట్ ఏంటి ? అని ఎన్ని హేళనలు చేసినా ఆమె ఇండియన్ టీమ్ కి ఎలా వెళ్ళింది అనేదే ఈ సినిమా కధ.  


క‌థ‌నం :

కౌసల్య కృష్ణమూర్తి తమిళ హిట్‌ కణా సినిమా రీమేక్‌. తమిళ క‌ణలో మంచి ఎమోష‌న్స్ ఉన్నాయి, ఏజ్ కి సంబంధం లేకుండా మనవాళ్ళు ఫాలో అయ్యే క్రికెట్ ఉంది. ఆ రెండింటినీ మిక్స్ చేసిన విధానం బాగుంటుంది. ‘కౌసల్య కృష్ణ‌మూర్తి’ కూడా ఎక్కడా పొల్లుపోకుండా దాన్నే ఫాలో అయిపోయింది. తమిళ మాతృక‌ను ఏమాత్రం మార్చ‌కుండా, య‌థావిధిగా చూపించే ప్ర‌య‌త్న‌మే చేశారు. ఓ పల్లెటూరి అమ్మాయి క్రికెట‌ర్‌గా ఎదిగే తీరు, రైతులను సమాజం చూస్తున్న సమాజం అనే రెండు లైన్స్ని క‌థ‌లో భాగం చేసిన విధానం బాగుంది. చివ‌ర్లో రైతుల్ని బ‌తికించండి, రైతుల్ని అప్పుల పాలు చేయొద్దు అంటూ ఇచ్చిన సందేశం అంద‌రికీ న‌చ్చుతుంది.ఓ వైపు క్రికెటర్‌గా ఎదిగేందుకు కౌసల్య పడే కష్టాలను చూపిస్తూ.. మరోవైపు ఈ దేశంలో రైతుగా బతకడం ఎంత కష్టమో, వారు అనుభవించే దుర్భర పరిస్థితులను చూపించాడు. అయితే కథనం మొత్తం ప్రేక్షకుడు ముందే ఊహించేలా సాగడమే కాస్త నిరాశ కలిగించే విషయం.

నటీనటులు :

మాతృక క‌ణ‌లో క్రికెట‌ర్‌గా న‌టించిన ఐశ్వ‌ర్య రాజేష్‌, ఇందులో కూడా అదే పాత్ర పోషించింది. కొత్త అమ్మాయిని కాకుండా ఐశ్వ‌ర్య‌నే మ‌ళ్లీ ఎంచుకోవ‌డం వ‌ల్ల ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌ని సుల‌భం అయ్యిందని చెప్పాలి. రెండో సారి కూడా ఆ పాత్ర‌లో ఐశ్వ‌ర్య‌ మ‌రోసారి రాణించింది. రాజేంద్ర ప్ర‌సాద్, ఝాన్సీ , నరసింహారావు వంటి వారి నటన బాగుంది. క‌ణ‌లో శివ కార్తికేయ‌న్ పోషించిన పాత్ర ను మళ్ళీ మరోసారి పోషించారు. ఇక ఈ సినిమాకు సంగీతం హైలైట్. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్యం సంగీతంతో సినిమాని మరో లెవల్‌ కి తీసుకెళ్ళాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ విభాగాలు సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

ఫైనల్ గా : ఆలోచింపచేసే కౌసల్యా కృష్ణమూర్తి 

రేటింగ్ : 3.5 / 5

More Related Stories