పొగరు చూపిస్తున్న అర్జున్ మేనల్లుడు

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కన్నడ హీరో ధృవ సర్జా తెలుగులో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పొగరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గంగాధర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబందించిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ సినిమాలో పలువురు ఇంటర్నేషనల్ వైడ్ బాడీ బిల్డర్స్ కూడా నటిస్తున్నారు. తాజాగా హీరోకు, ఆ బాడీ బిల్డర్స్‌కు మధ్య వచ్చే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారని అంటున్నారు.
ఆ ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ ఎవరంటే ఫ్రెంచ్ బాడీ బిల్డర్ మోర్గాన్ అస్తే, అమెరికన్ బాడీ బిల్డర్ కై గ్రీనే, జాక్ లుకాస్, జో లిన్‌డర్ వంటి వారున్నారు. ఇక ఈ సినిమాలో ఆర్జీవీ నిర్మించిన భైరవగీత ఫేమ్ ధనుంజయ్ విలన్‌గా నటిస్తున్నారు. అయితే తెలుగులో పొగరు పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమాని అన్ని బాషలలో రిలీజ్ చేయాలని భావిస్తోంది సినిమా యూనిట్. అయితే ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన అర్జున్ సర్జా ఇప్పుడు దాదాపుగా చేయడమే మానేశాడు. మరి ఆయన వారసత్వాన్ని ఈయన ఎంతవరకూ నిలబెడతాడో చూడాలి మరి.