హ్యాపీ బర్త్ డే టు ఎవర్ గ్రీన్ మన్మధుడు అక్కినేని నాగార్జున..

గ్రీకువీరుడు.. నా రాకుమారుడు.. కళ్లలోనే ఇంకా ఉన్నాడు.. ఈ పాట అప్పట్లో నాగార్జునను ఉద్దేశించి ఏ ముహూర్తంలో రాసారో కానీ ఇప్పటికీ ఇదే కొనసాగుతుంది. వయసు 60కి చేరువైనా కూడా ఇప్పటికీ ఈయన్ని మన్మథుడు అనే అంటున్నారు. అదేం చిత్రమో కానీ ఆ బ్రహ్మదేవుడు ఈయనకు మాత్రమే వయసు దాచుకునే యంత్రం ఇచ్చినట్లున్నాడు. ముప్పై ఏళ్లకే ముదుర్లు అయిపోతున్న ఈ రోజుల్లో 60ల్లో కూడా 20ల్లా కనిపిస్తున్నాడు మన్మథుడు. 1959 ఆగస్ట్ 29న జన్మించాడు నాగార్జున. 1986లో విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు నాగార్జున. ఇది హిందీలో జాకీష్రాఫ్ హీరోగా వచ్చిన హీరో సినిమాకు రీమేక్.
ఈ సినిమాతో నాగార్జునకు నటుడిగా మంచి పేరు వచ్చింది. కానీ కోరుకున్న హిట్ రాలేదు.. దానికితోడు ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు నాగార్జునకు ఒక్క హిట్ కూడా రాలేదు. ఓ టైమ్ లో ఏఎన్నార్ పేరు చెడగొట్టడానికే నాగార్జున వచ్చాడంటూ విమర్శలు కూడా వచ్చాయి. కానీ అన్నీ మౌనంగా భరించి ఆఖరిపోరాటంతో కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ సినిమా శ్రీదేవి ఖాతాలోకి వెళ్లిపోయింది. అలాంటి టైమ్ లో తనను తాను సోలోగా నిరూపించుకునే క్రమంలో కొత్త దర్శకుడు రామ్ గోపాల్ వర్మను నమ్మి చేసిన సినిమా శివ. ఇది తెలుగు సినిమా చరిత్రను మార్చేసింది.
ఇక 1989లోనే వచ్చిన గీతాంజలి కూడా సంచలనం సృష్టించింది. ఈ రెండు సినిమాలతో తాను ఏఎన్నార్ కు అసలైన వారసున్నే అని నిరూపించుకున్నాడు నాగార్జున. ఇక 90ల్లో ఈయన దూకుడు ఆగలేదు. వరసగా కొన్ని ప్లాపులు వచ్చినా కూడా అల్లరి అల్లుడు.. ప్రెసిడెంట్ గారి పెళ్లాం.. హలోబ్రదర్.. ఘరానా బుల్లోడు.. ఆవిడా మా ఆవిడే.. నిన్నేపెళ్లాడతా.. నిన్నే ప్రేమిస్తా.. నువ్వు వస్తావని.. మన్మథుడు.. అన్నమయ్య.. మాస్.. కింగ్.. మనం.. సోగ్గాడే చిన్నినాయనా.. ఊపిరి లాంటి ఎన్నో విజయాలతో ఈయన సూపర్ స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇన్నేళ్ల కెరీర్ లో నాగ్ చేసినన్ని ప్రయోగాలు.. ఈయన ప్రయత్నించినన్ని కొత్త కథలు మరే హీరో చేయలేదు. కొత్త దర్శకులను నమ్మడంలో ఈయన తర్వాతే ఎవరైనా. భయం అనే మాటలను పూర్తిగా పక్కనబెట్టేసి కథ నచ్చితే ముందడుగు వేస్తాడు నాగార్జున. మొత్తానికి నాగార్జున ఉన్నాడు కాబట్టే ఈ రోజు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఇలా స్టార్ డైరెక్టర్లుగా చక్రం తిప్పుతున్నారు. ఇలాంటి హీరోలు ఇంకా రావాలని.. ఈయనే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని ఆశిస్తూ సినిమా పాలిటిక్స్ తరఫు నుంచి హ్యాపీ బర్త్ డే నాగార్జున గారు.