చిరంజీవికి తప్పిన పెను ప్రమాదం...అసలేమయ్యిందంటే

మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. నిన్న సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ముందుగానే లోపాన్ని గుర్తించి అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని అత్యవసరంగా వెనుకకు మళ్లించడంతో ఈ ప్రమాదం నుంచి ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న వారు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సైరా రిలీజ్ పనుల మీద ముంబై వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి నిన్న సాయంత్రం హైదరాబాద్ వచ్చేందుకు విస్తారా ఎయిర్లైన్స్ విమానం ఎక్కారు. ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే వెనుకు మళ్లించి ముంబై ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్లో మొత్తం 120మంది ప్రయాణికులు ఉన్నారు.
సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే పైలట్ సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులకు అ విమాన యాజమాన్యం అసౌకర్యం కలిగించినట్టు చెబుతున్నారు. విమానం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు మరో విమానం కోసం ఎయిర్ పోర్టులోనే గంటలపాటు పడిగాపులు పడినట్టు సమాచారం. అనంతరం మరో విమానాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు ప్రయాణికులను హైదరాబాద్కు పంపించినట్టు తెలిసింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాతో పాటూ వాట్సాప్లో తన స్నేహితులకు షేర్ చేశారు. దీంతో ఈ ప్రమాద ఘటన ఆలశ్యంగా బయటకు వచ్చింది.